Share News

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ పార్టీ..

ABN , Publish Date - Dec 30 , 2024 | 10:10 AM

గతేదాడితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. నేరగాళ్లకు శిక్షలు విధించే రేటూ తగ్గిపోయిందని మండిపడింది. శాంతి భద్రతల పర్యవేక్షణ వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్‌ రేట్ దారుణంగా పెరిగిందని ధ్వజమెత్తింది.

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ పార్టీ..
BRS Party

హైదరాబాద్: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అన్నదాతలకు రైతు భరోసా అందించకుండా కమిటీల పేరుతో ఇప్పటివరకూ కాలయాపన చేశారని మండిపడింది. మళ్లీ ఇప్పుడు శాటిలైట్ సర్వే ద్వారా పంట సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తామంటూ పూటకో కొర్రీ పెడుతూ తుగ్లక్ రేవంత్ సర్కార్ రైతులను దగా చేస్తోందని మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించింది.


ఒక్కరికేనా..!

"ఇంట్లో ఎంతమంది రైతులున్నా ఏడు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అది కూడా కుటుంబంలో ఒక్కరికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు భూమిని పంచుతారు. కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా ఇస్తే 20 లక్షల మందికి మొండిచెయ్యి చూపించినట్లు అవుతుంది. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రైతు భరోసా కోత మార్గాలపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. నాడు రైతుల పట్ల కేసీఆర్ మానవీయత చాటుకుంది. నేడు నిర్దయగా కాంగ్రెస్‌ సర్కార్‌ ఆలోచిస్తుంది. రైతుబంధు రెండు సీజన్లకు అందలేదు. రుణమాఫీ అరకొరగానే ముగించేశారు. బోనస్‌ నాల్గోవంతు సన్నాలకైనా దక్కలేదు. ఈ మూడు సంఘటనలతో కాంగ్రెస్‌ చెప్తున్న మాటలకు, చేతలకూ మధ్య పొంతన లేదని తేలిపోయింది. దీంతో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని సర్కార్‌ చెప్తున్నా.. రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్ని కొర్రీలు పెడతారోనని, ఇంకెంత కోత విధిస్తారోనని అన్నదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే.. అది కూడా ఏడెకరాలకే రైతు భరోసా ఇస్తారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది" అంటూ ట్వీట్ చేసింది.


నేరాలు పెరిగాయ్..

తెలంగాణలో మూడు గంటలకో రేప్‌, ఐదు గంటలకో కిడ్నాప్‌ జరుగుతోందని, కాంగ్రెస్ ఏడాది పాలనలో నేరాలు భారీగా పెరిగాయంటూ బీఆర్ఎస్ పార్టీ తన ఎక్స్ అకౌంట్‌లో మరో ట్వీట్ చేసింది.


  • "రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్‌ 9.87%

  • రేప్‌ కేసుల్లో పెరుగుదల 28.94%

  • ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన నేరాలు 20.24%

  • వివిధ కేసుల్లో శిక్షల రేటు 27.67%

  • వివిధ రకాల దోపిడీల్లో పెరుగుదల 33.65%

  • డయల్‌ 100 రెస్పాన్స్‌ టైమ్ 15 నిమిషాలు


గతేదాడితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు నేరగాళ్లకు శిక్షలు విధించే రేటూ తగ్గిపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణ వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్‌ రేట్ దారుణంగా పెరిగింది. దొంగతనాలు, దోపిడీలు సగటున గంటకు ఏడు చొప్పున జరుగుతున్నాయి. శాంతిభద్రతల వ్యవస్థ గాడి తప్పిందనేందుకు ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి" అంటూ ట్వీట్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR: ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

శంషాబాద్‌ విమానాశ్రయంలో మద్యం మత్తులో ప్రయాణికురాలి హల్‌చల్‌

Updated Date - Dec 30 , 2024 | 10:13 AM