K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:37 AM
ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు.
జగిత్యాలలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు
కవిత భూమిపూజ.. కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం
జగిత్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీవోను ధిక్కరించి జగిత్యాల జిల్లా కేంద్రంలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు కవిత ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నామని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆమె చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దంటోందని విమర్శించారు.
ఉద్యమ తెలంగాణ తల్లిని గ్రామగ్రామాన ప్రతిష్ఠించుకుంటామని, కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తమలో ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని చెప్పారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్... పార్టీని వీడి ద్రోహం చేశారని విమర్శించారు. ‘బతుకమ్మ తల్లి మాదిరా.. కాం గ్రెస్ తల్లి మీదిరా’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ పాల్గొన్నారు. కాగా, జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను కవిత సందర్శించారు. ఇటీవల పాఠశాల విద్యార్థులు ఆరుగురు చలి తీవ్రతతో అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో కవిత పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు, బోధన తదితర అంశాలపై ఆరా తీశారు.