KIMS: అంధుల నేస్తాలు.. ఏఐ ఆధారిత కళ్లద్దాలు
ABN , Publish Date - Nov 22 , 2024 | 03:19 AM
అత్యాధునిక కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఉపయోగించి రూపొందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ తయారీ
స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్ సిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఉపయోగించి రూపొందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కళ్లద్దాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా అంధులు ఉన్నారని, వారికి స్మార్ట్ కళ్లద్దాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్మార్ట్ కళ్లద్దాలు అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతాయన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వైద్యసేవల సంస్థల సాయంతో ఈ స్మార్ట్ కళ్లద్దాలను అవసరమైన అంధులకు పంపిణీ చేయిస్తామని కేఎ్‌ఫఆర్‌సీ చైర్మన్ వి.భుజంగరావు తెలిపారు. కళ్లద్దాలు ఇవ్వడంతోపాటు ఎలా వాడాలన్న అంశంపై శిక్షణ అందిస్తామని వివరించారు. ఆర్థిక స్థోమత లేని పేదలకు ఉచితంగా అందజేస్తామన్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల అంధులు మరింత సులభంగా తిరగగలరని కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఆస్పత్రి సీఎండీ బొల్లినేని భాస్కరరావు పేర్కొన్నారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు పాల్గొన్నారు.
ఇవీ ఉపయోగాలు
ఏదైనా రాసి ఉన్నా, ప్రింట్ చేసి ఉన్నా దాన్ని ఈ కళ్లద్దాలే చదివి వినిపిస్తాయి. దానివల్ల అంధులకు చదవడం, కమ్యూనికేషన్ మరింత సులభం అవుతుంది. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వాయిస్ రూపంలో సూచిస్తాయి. ఎదురుగా ఉన్న వారిని ఇవి గుర్తిస్తాయి. తద్వారా అంధులు వారితో ధైర్యంగా మాట్లాడే వీలుంటుంది. దారిలో ఎదురయ్యే వస్తువులు, అడ్డంకులు, పరిసరాలను గుర్తించడం వల్ల నడిచేటప్పుడు ఇబ్బందులుండవు.