Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్ వాల్ కట్టండి
ABN , Publish Date - Oct 20 , 2024 | 03:44 AM
ముందు మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని, డ్రెయినేజీల నీరు కలవకుండా మళ్లించాలని, ఆ తర్వాతే మూసీ సుందరీకరణ గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఆ తర్వాతే సుందరీకరణపై ఆలోచన చేయండి
25న మూసీ నిర్వాసితులతో కలిసి ధర్నా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మెహిదీపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ముందు మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని, డ్రెయినేజీల నీరు కలవకుండా మళ్లించాలని, ఆ తర్వాతే మూసీ సుందరీకరణ గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా కాకుండా పేదల ఇళ్లను కూల్చుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శనివారం ఆయన కార్వాన్ నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లకు మార్కింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఏళ్ల తరబడి మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు రోడ్డున పడుతున్నారన్నారు. 30, 40 ఏళ్ల నుంచి లక్షలాది మంది ఒక్కో ఇటుక పేర్చి, ఒక్కో సిమెంటు బస్తా కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారన్నారు. వారి ఇళ్లను ఇప్పుడు కూల్చివేస్తామంటే న్యాయం కాదన్నారు. ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా పేదల కోసం పని చేయాలి.. పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలి.. మరి రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలే.. కనీసం కట్టేందుకు భూమి పూజ కూడా చేయలే.. కానీ కట్టిన ఇళ్లు మాత్రం కూలగొడుతున్నార’ని ఆరోపించారు.
తాను హైదరాబాద్‌లోనే పెరిగానని, ఎప్పుడూ ఇళ్లల్లోకి వరద నీరు రాలేదన్నారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఇళ్లలోకి వరద నీరు రాకుండా అడ్డుకోవాలంటే రిటైనింగ్ వాల్ కట్టాల్సిన అవసరం ఉందని, గతంలో కూడా నిజాం ఉన్నప్పుడు కట్టారని తెలిపారు. అలాగే డ్రెయినేజీల నీరు కలవకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మూసీ నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘మీ ఇళ్లు కూల్చాల్సి వస్తే... వాళ్లు ముందుగా మమ్మల్ని జైలులో పెట్టి రావాల’న్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు బీజేపీ కృషి చేసిందని గుర్తుచేశారు. మూసీ నిర్వాసితులకు అండగా ఈ నెల 25న ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేస్తామన్నారు.