KTR: మన్మోహన్ సింగ్ భారత రత్నకు అర్హులే..: కేటీఆర్
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:06 PM
సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. మన్మోహన్‌కు భారతరత్న ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, భారతరత్న పురస్కారానికి మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: దివంగత మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతికి సంతాపం (Condolences) తెలపడానికి సోమవారం శాసనసభ (Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సభ సమావేశం ప్రారంభమైంది. శాసనసభ మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని అన్నారు. మన్మోహన్‌కు భారతరత్న ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని కేటీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ (తెలంగాణ మాజీ సీఎం) కేంద్ర మంత్రిగా పనిచేశారని కేటీఆర్ తెలిపారు. 2024లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్‌లోకి భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారన్నారు. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టు పోలియో ఇచ్చారని.. యూపీఏ ప్రధాన భాగస్వామ్యం అయిన డీఎంకే అభ్యంతం లేవనెత్తిందని.. ఆ పదవి తమ పార్టీకి ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు కేసీఆర్‌కు ఎలా ఇస్తారని అభ్యంతరం తెలపడంతో.. కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి తాను వచ్చింది పదవులకోసం కాదని.. ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చానని చెప్పి.. పదవి తిరిగి ఇచ్చేశారన్నారు.
దీంతో మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే.. ‘‘చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో.. సిద్ధాంతో తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చారో అది ఫలించాలని నేను కోరుకుంటున్నానని.. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు గుర్తింపు, గౌరవం వస్తుందని, మీరు కర్మయోగిగా గుర్తింపబడతారని’’ అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక గొప్ప ఆలోచనకు.. అరుడైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ నమ్మారు కాబట్టే.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్దత, బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. ఇవన్నీ అర్థమైంది కాబట్టే 2014లో అనివార్య పరిస్థితిలో రాష్ట్రం ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోమని అన్నారు.