Share News

Scholarships: విద్యార్థుల పట్ల సర్కారుకు చిన్నచూపెందుకు?

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:37 AM

ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల బకాయిలు రూ.5900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

Scholarships: విద్యార్థుల పట్ల సర్కారుకు చిన్నచూపెందుకు?

  • ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు చెల్లించాలి

  • సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పేరిట రుణమాఫీలో కొత్త డ్రామా

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పల బకాయిలు రూ.5900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో విద్యా సంస్థలు, విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోందని గురువారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్‌ సర్కారుకు చిన్నచూపు ఎందుకని, దాదాపు ఆరు వేల కోట్ల స్కాలర్‌షిప్‌ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా రుణం మాఫీకాని రైతులను రేవంత్‌ సర్కార్‌ అవమానిస్తోందని, మాఫీ చేయలేక సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టిందని కేటీఆర్‌ ఆరోపించారు.


రుణమాఫీలో వాపస్‌ అప్షన్‌ పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ఇచ్చేది పక్కనపెట్టి వాప్‌సపై దృష్టి పెట్టారని.. రుణమాఫీ కోసం రైతులు సెల్ఫీ దిగి నేను రైతునని నిరూపించుకోవాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాగా, ఏడాది కిందట చైనాకు చెందిన ఆటోమేకర్‌ సంస్థ బియాది(బీవైడీ) తెలంగాణలో తమ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వని కేంద్రం.. ఇప్పుడు ఎందుకు ఆహ్వానిస్తుందో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బీవైడీ సంస్థ పెట్టుబడులు పెట్టి ఉంటే వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కేవని ఆయన అన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 04:37 AM