Heavy Rain: అకాల వర్షంతో అతలాకుతలం
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:24 AM
రాష్ట్రంలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురియగా.. చాలా చోట్ల మోస్తరు వానలు పడ్డాయి.

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వడగండ్లు
తడిసిన ధాన్యం.. దెబ్బతిన్న వివిధ పంటలు
సంస్థాన్‌నారాయణపురంలో 9.7 సెం.మీ. వర్షం
పిడుగుపాటుకు నలుగురి మృతి.. గోడ కూలి ఒకరు
హైదరాబాద్‌లో గంటన్నర పాటు దంచికొట్టిన వాన
భారీ వర్షం ధాటికి చార్మినార్ నుంచి ఊడిన పెచ్చులు
అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రంలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురియగా.. చాలా చోట్ల మోస్తరు వానలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలకు వరి పంట నేలకొరగ్గా.. మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్‌నారాయణపురంలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ ఈదురుగాలులకు భువనగిరి-రాయగిరి రోడ్డులోని మాస్‌కుంట వద్ద చెట్లు కూలి రోడ్డు మధ్యలో పడిపోవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట మండలాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ధర్పల్లి మండలంలో గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం రాశులు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురువడంతో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, పిట్లం, సదాశివనగర్, కామారెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కలు, పొద్దు తిరుగుడు గింజలు తడిసిముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు కొత్తవాడలో చామగడ్డ పంట నీటమునిగింది. జిల్లాలో అనేక చోట్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో విద్యుత్తు స్తంభాలు నేల కూలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో వానకు తోడు గాలులు వీయడంతో మామిడి తోటలకు స్వల్ప నష్టం జరిగింది. అక్కడక్కడ కోతకు సిద్ధమైన మిర్చి పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పిడుగులు పడి నలుగురి మృతి
వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మృతి చెందగా.. గోడ కూలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూలు జిల్లా పదర మండల కేంద్రం శివారులోని కోడొనిపల్లికి చెందిన సుంకరి సైదమ్మ(35), వీరమ్మ(55)లు వేరుశనగ పంట పొలంలో కూలీ పనులకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడటంతో అక్కడికక్కడే ఆ ఇద్దరు మృతి చెందారు. మరో కూలీ సుంకరి లక్ష్మమ్మ్జకు తీవ్రగాయాలు కావడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ వెంకటేశ్వర్లు (40) పశువులు మేపేందుకు వెళ్లి పొలం వద్ద పిడుగుపాటుకు గురై మరణించాడు. అదే జిల్లా వడ్డేపల్లి మండలం బుడవరుసులో పశువులకు మేత వేసేందుకు వెళ్లిన హరిజన మహేంద్ర (20) కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా గజ్వే ల్ మండలం జాలిగామలో గోడ కూ లి ఒకరు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొడంగల్ మండ లం ఖాజా అహ్మద్‌పల్లిలో రైతు ఫకీరప్ప 30 గొర్రె లు, మేకలు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి.
హైదరాబాద్‌లో గంటన్నర పాటు వాన..
ఇటు హైదరాబాద్‌లో దాదాపు గంటన్నర పాటు వాన దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్, హిమాయత్‌నగర్, డబీర్‌పురాలో 8.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మలక్‌పేట రోడ్ అండర్ బ్రిడ్జి కింద వరదలో ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు బస్సు టాప్‌పైకి ఎక్కారు. ఇటు సరూర్‌నగర్ వద్ద మూసీ నదిలోని శివాలయానికి వెళ్లిన ఇద్దరు అక్కడే చిక్కుకున్నారు. అధికారులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బౌద్ధనగర్, హబ్సీగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వ ముద్రణాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. సోమాజిగూడ రవాణా శాఖ కార్యాలయం వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడగా.. దాన్ని తొలగించారు. వర్షం ధాటికి చారిత్రక చార్మినార్ కట్టడంలో భాగ్యలక్ష్మి ఆలయం వైపున్న ఓ మినార్ పెచ్చులూడి కిందపడ్డాయి. అయితే సుందరీకరణ నేపథ్యంలో మినార్‌పై వేసిన ప్లాస్టర్ మాత్రమే ఊడిందని.. మరమ్మతులు కొనసాగుతున్నాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఇక గ్రేటర్ వ్యాప్తంగా చెట్లు కూలాయని 28, వరద నీరు నిలిచిందని 48 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2-3 గంటల్లోనే వాటిని పరిష్కరించామని వెల్లడించారు.
అప్రమత్తంగా ఉండాలి అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానలు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు, విద్యుత్తు అంతరాయాలు లేకుండా జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News