Share News

Seethakka: బస్సులో అల్లం, ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్కా?

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:32 AM

‘‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లం, ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా? దాన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపిస్తున్నారు’’ అంటూ మంత్రి సీతక్క బుధవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు.

Seethakka: బస్సులో అల్లం, ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్కా?

  • బస్సులో కుట్లు, అల్లికలు.. అవసరమైతే బ్రేక్‌ డ్యాన్స్‌, రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేయండి

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు

  • సుమోటోగా విచారణకు స్వీకరించినట్టు మహిళా కమిషన్‌ చైర్మన్‌ వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లం, ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా? దాన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపిస్తున్నారు’’ అంటూ మంత్రి సీతక్క బుధవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. గురువారం ఉదయం పార్టీ రాష్ట్రకార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


‘‘బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పా? కుట్లు అల్లికలు చేస్తే తప్పా’ అని మా సీతక్క అంటున్నరు.. తప్పని మేమెక్కడ అన్నామక్కా.. ‘తన్నుకుంటున్నారు.. మంచిగలేదు’ అని మామూలుగా అన్నం. మనిషికో బస్సు పెట్టు.. మేమెందుకు అంటం. మనిషికో బస్సు పెడితే కుటుంబం అంతాపోయి మంచిగ కుట్లు అల్లికలు, అవసరమైతే.. బ్రేక్‌డ్యాన్స్‌లు, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏం చేస్తరో చెయ్యండి.. మేమెందుకు వద్దంటం. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బస్సుల్లో ఈ రకంగా ఎప్పుడైనా ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి ఉండేదా? సీట్ల కోసం కొట్టుకొనుడు, సిగలు పట్టుకొనుడు, గుద్దుకొనుడు.. ఎన్నెన్ని చూస్తున్నం’ అని వ్యాఖ్యానించారు.


ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు అనుచితమని.. వాటిని కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించిందని ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారమయ్యాయని, అవి మహిళలకు అవమానకరంగా, వారిని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. దీన్ని గమనించిన కమిషన్‌ అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం స్వతంత్ర విచారణను ప్రారంభించినట్టు తెలిపారు. మరోవైపు.. కేటీఆర్‌ వ్యాఖ్యలకు నిరనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసి, నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Aug 16 , 2024 | 04:32 AM