Share News

ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా పాతుదాం: పొన్నం

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:03 AM

చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా పాతేందుకు సమాయత్తం కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అమలు చేయలేదని విమర్శించారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా పాతుదాం: పొన్నం

కొత్తూర్‌/రవీంద్రభారతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా పాతేందుకు సమాయత్తం కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అమలు చేయలేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలమూరు న్యాయ యాత్ర అదివారం రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండలం పెంజర్లలో కొనసాగింది. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం సమావేశంలో మాట్లాడుతూ.. పదవులు పోయాయన్న అక్కసుతో పసికూన వయసులోనే ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు మాటల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బెంజ్‌ కార్లలో తిరిగిన నాయకులు.. ఇప్పుడేమో ఆటోలు ఎక్కుతూ డ్రామాలకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా దశాబ్ద కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను నిలదీయాలని ప్రజలకు పొన్నం పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల అధ్యయనానికే తాను న్యాయ యాత్ర చేపట్టినట్టు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. కాగా, మైనింగ్‌ కాంట్రాక్టుల్లో వడ్డెర కులస్తులకు ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. వడ్డెరలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన వడ్డెరల ఆత్మగౌరవ సభలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కర్ణాటక బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ తంగ్డేలతో కలసి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. వడ్డెర వసతి గృహ నిర్మాణానికి తనవంతు సహకారమందిస్తామన్నారు. వడ్డెర ఫెడరేషన్‌ ఏర్పాటుతో పాటు మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ విషయంలో సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వడ్డెరలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వడ్డెర సంఘం డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కర్ణాటకలో వడ్డెరులు ఎస్సీ జాబితాలో ఉన్నారని.. తెలంగాణలో వారిని ఎస్టీల్లో చేర్చాలని కర్ణాటక మంత్రి శివరాజ్‌ కోరారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తానన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 03:03 AM