Share News

Ponnam: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ABN , Publish Date - Oct 16 , 2024 | 04:15 AM

గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Ponnam: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

  • బకాయిలన్నీ విడుదల చేస్తాం: పొన్నం

  • గురుకులాలకు తాళం వేస్తే క్రిమినల్‌ కేసులు

  • కలెక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా పండగ సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన విద్యార్ధులు తిరిగి పాఠశాలలకు చేరుకుంటున్న తరుణంలో కొన్నిప్రాంతాల్లో ఆయా భవనాల యజమానులు అద్దెలు చెల్లించని కారణంగా తాళాలు వేసిన నేపఽథ్యంలో మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, అయితే ఆయా భవనాలకు అద్దె బకాయిలు గడిచిన పది నెలలకు సంబంధించినవి కాదనే విషయాన్ని యజమానులు గమనించాలన్నారు. కొన్నేళ్లుగా వారు గత ప్రభుత్వాన్ని బకాయిలు అడగలేక పోయారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని అన్ని గురుకులాలపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని, అధికారుల నుంచి వివరాలను తెప్పించుకుని బకాయిలు విడుదల చేయాలని ఆదేశించారని తెలిపారు. చాలా వరకు పాత బకాయిలతో సహా మెస్‌ చార్జీలు మూడు రోజుల క్రితమే చెల్లించినట్టు వివరించారు. త్వరలో అద్దె బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపఽథ్యంలో ఎవరి మాటలో పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని భవన యజమానులను మంత్రి హితవు పలికారు. గురుకులాల్లో పెట్టిన బ్యానర్లను తక్షణం తొలగించాలని కోరారు. గురుకులాలకు తాళం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదు చేయాలని గురుకుల ప్రిన్సిపల్‌ ఆర్సీవోలకు సూచించారు. ప్రత్యామ్నాయంగా వేరే భవనాలు చూడాలన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 04:15 AM