ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్
ABN , Publish Date - Jan 19 , 2024 | 05:31 AM
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు గురువారం ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గ

మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు గురువారం ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతోంది. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య రూ. 8 కోట్ల లావాదేవీలకు సంబంధించి గతంలో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా గడ్డం వివేక్ గురువారం ఈడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. గత నవంబరులో ఈడీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీల పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో లభించిన పత్రాలు, డిజిటల్ ఆధారాల మేరకు ఈడీ గుర్తించింది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు లెక్కల్లో చూపించినా... వారి మధ్య కేవలం లక్షల్లోనే నగదు లావాదేవీలు జరిగినట్లు సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా ఈడీ గుర్తించినట్లు సమాచారం. వివేక్‌కు సంబంధించిన సంస్థల్లో విదేశాల నుంచి లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు కనుగొన్నట్లు తెలిసింది.