Share News

AP Higher Education: స్థానికతపై దారెటు?

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:04 AM

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా రద్దు చేసినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ, సీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు. కోటా అంశం కోర్టులో నిలవదని భావిస్తూ ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది.

AP Higher Education: స్థానికతపై దారెటు?

ఇంకా ఎటూ తేల్చని ఉన్నత విద్యా శాఖ

పదేళ్లు దాటిందని తెలంగాణలో ఏపీ కోటా రద్దు

అలాగే తెలంగాణ కోటా రద్దుకు ఏపీ నిర్ణయం

కానీ స్థానికత తేల్చకుండానే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌

ప్రభుత్వ నిర్ణయం మేరకు అడ్మిషన్లు అని నిబంధన

పరీక్ష రాశాక సీటు ఇవ్వలేం అంటే ఎలా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

స్థానికత అంశంపై ఉన్నత విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఓవైపు పక్క రాష్ట్రం తెలంగాణ నెల రోజుల ముందే ఏపీ విద్యార్థులకు కోటా లేదని తేల్చేయగా... ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ మాత్రం ఇంకా ఆలోచన స్థాయిలోనే ఉంది. ఫలితంగా స్థానికతపై స్పష్టత ఇవ్వకుండానే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. పరీక్ష రాయడానికి తెలంగాణ విద్యార్థులు కూడా అర్హులే అయినా.. సీటు కేటాయింపుపై మాత్రం గ్యారెంటీ లేదని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఏపీఈఏపీసెట్‌ రాసిన తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించాం కాబట్టి సీటు ఇవ్వాలని పట్టుబడితే పరిస్థితి ఏమిటనేది అర్థం కావట్లేదు..!

ఏపీ విద్యార్థులకు కోటా రద్దు

ఉన్నత విద్యలో ప్రాంతాల ఆధారంగా అన్‌రిజర్వ్‌డ్‌ కోటా అమలవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 371(డి) ప్రకారం ఉమ్మడి ఏపీలో ప్రాం తాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశారు. ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, ఉస్మానియా వర్సిటీలు ఇందులో ఉన్నాయి. ఉస్మానియా రీజియన్‌ పరి ధి తెలంగాణ మొత్తం ఉంటుంది. ఏపీలో 2 భాగాలుగా ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర ఉన్నాయి. ఈ 3 వర్సిటీలను రీజియన్లుగా తీసుకుంటారు. ఇందులో ప్రతి వర్సిటీకి 85 శాతం స్థానిక కోటా ఉంటుంది. 15 శాతం సీట్లు మిగిలిన 2 రీజియన్లకు అన్‌రిజర్వ్‌డ్‌ కోటా కింద ఉంటాయి. అంటే ఆ 15శాతం సీట్లకు 3 యూనివర్సిటీల పరిధిలోని విద్యార్థులూ పోటీపడొచ్చు. దీంతో ప్రతి యూనివర్సిటీలోని 15శాతం సీట్లను మిగిలిన 2 యూనివర్సిటీల రీజియన్ల పరిధిలోని విద్యార్థులు పొందవచ్చు.


విభజనకు సంబంధం లేకపోయినా..

ఈ మూడు రీజియన్ల రిజర్వేషన్‌ విధానానికి, రాష్ట్ర విభజనకు ఎలాంటి సంబంధం లేదు. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిందనే కారణం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం ఓయూ రీజియన్‌ అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఏయూ, ఎస్వీయూలను తొలగించింది. దీంతో ఏపీ విద్యార్థులకు ఓయూ పరిధిలో సీట్లు రావు. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం కూడా అచ్చం అలాగే ఏయూ, ఎస్వీయూల పరిధిలో ఓయూ రీజియన్‌ను రద్దుచేయాలనే నిర్ణయం తీసుకుంది. కానీ.. ఉత్తర్వులు జారీకాలేదు. మరోవైపు ఇంటర్‌ పరీక్షలు ముగియడం, ఇంజనీరింగ్‌, ఫార్మసీల్లో సీట్లకు ఈఏపీసెట్‌ గడువు సమీపించడంతో సెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని అందులో నిబంధన పెట్టింది. ‘ఇతర రాష్ర్టాలు’ ఆప్షన్‌ ద్వారా తెలంగాణ విద్యార్థులకూ ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

కోర్టులో వీగిపోతుందనే వాదన

ఉన్నత విద్యలో రీజియన్ల ఆధారిత కోటా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కోటా అమల్లోకి వచ్చిం ది. కానీ దీన్ని రాష్ట్ర విభజనతో ముడిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం కోటా రద్దుచేసింది. అలాగే ఏపీ కూడా చేస్తే అది న్యాయస్థానంలో వీగిపోతుందనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలిసింది. అందుకే కోటాపై ఏపీ ప్రభుత్వం మూడు రకాలుగా ఆలోచన చేస్తోంది. మొదటిది తెలంగాణ తరహాలోనే పూర్తిగా ఓయూని తొలగించి ఏపీని ఒకే యూనిట్‌గా రిజర్వేషన్‌ అమలుచేయడం. రెండోది ఓయూ లేకుండా ఏయూ, ఎస్వీ యూ రీజయన్లు అలాగే ఉంచి రెండూ ఒకదానికి ఒకటి నాన్‌ లోకల్‌ అయ్యేలా మొత్తం సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయించడం. మూడోది ఏపీ విద్యార్థులకు 85శాతం సీట్లు కేటాయించి, మిగిలిన 15శాతం సీట్లకు ఇతర రాష్ర్టాలు అని పేర్కొనడం. అయితే ఇతర రాష్ర్టాలు అం టే తెలంగాణ ఒక్కటేనా, మిగిలిన రాష్ర్టాల విద్యార్థులు కూడా ఉంటా రా? అనే దానిపై స్పష్టత లేదు. కానీ.. దీనిపై ఇప్పటికే ఏదొక నిర్ణయం తీసుకుని ఉంటే నోటిఫికేషన్‌ అందుకు అనుగుణంగా విడుదల చేసేవారు. ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నోటిఫికేషన్‌లో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:04 AM