TG Government Rice Sale Tender: దొడ్డు బియ్యం వేలం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:20 AM
ఉగాది నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానున్నా, దొడ్డు బియ్యం నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టెండరు పద్ధతిలో దొడ్డు బియ్యం విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం, బియ్యం నిల్వల లెక్కలు పరిశీలించి, మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని టెండర్లు నిర్వహించనుంది

సన్నబియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో సర్కారు ఆలోచన
8.40 లక్షల టన్నుల నిల్వలు
ముగిసిన మార్చి కోటా పంపిణీ
మిగిలిన దొడ్డు బియ్యం సీజ్ చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాది(ఏప్రిల్ నెల కోటా) నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. దొడ్డు బియ్యం నిల్వలపై దృష్టి సారించింది. ప్రభుత్వ గోదాముల్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని టెండరు పద్ధతిలో విక్రయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో భారత ఆహారసంస్థ(ఎ్‌ఫసీఐ) గోదాముల్లో 6.64 లక్షల టన్నులు, మధ్యంతర గోదాముల్లో 1.76 లక్షల టన్నులు కలిపి.. మొత్తం 8.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఇవికాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 చౌక డిపోల్లో వినియోగదారులకు పంపిణీ చేయగా మిగిలిన బియ్యం నిల్వలూ ఉన్నాయి. మార్చి నెల పీడీఎస్ కోటా పంపిణీ మంగళవారం(మార్చి 25)తో ముగిసింది. దీంతో మిగిలిన బియ్యం మొత్తాన్ని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఎన్ని బియ్యం ఉన్నాయో వాటి వివరాలను పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ లెక్కలు రానున్నాయి.
ఆయా నిల్వలను తిరిగి గోదాములకు తరలించే అవకాశముంది. గోదాముల వారిగా దొడ్డు బియ్యం నిల్వల లెక్కలు తేలిన తర్వాత టెండరుకు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం ధర క్వింటాలుకు రూ. 3,200 నుంచి రూ. 3,300 దాకా ఉంది. అయితే, మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని టెండర్లు నిర్వహిస్తారా? లేదా ప్రభుత్వమే బేస్ ప్రైస్(మూల ధర) నిర్ణయిస్తుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, దొడ్డు బియ్యం నిల్వలను ఖాళీ చేస్తే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కొంత ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత మార్కెట్ ధరల లెక్క (రూ. 3,200) ప్రకారం చూస్తే... 8.40 లక్షల టన్నులకు రూ.2,688 కోట్ల ఆదాయం వస్తుంది.