Telangana Politics: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు!
ABN , Publish Date - May 17 , 2024 | 03:57 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎ్‌సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు
పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి.. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా
కేటీఆర్‌తో భేటీకి పలువురు గైర్హాజరు.. ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన
వరంగల్, మే 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎ్‌సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా, రాకేశ్‌రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా.. నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్‌ఎస్ ఎదురీదుతోందనే చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్నిపరీక్షగా మారింది. శాసనమండలి పునరుద్ధరణ తరువాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీ్‌పకుమార్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా రెండు సార్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎస్ ప్రతిష్ఠకు పరీక్షగా మారింది. దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.
పల్లా పెత్తనంపై గులాబీ నేతల గుస్సా
జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, కేయూ జాక్ నేత వాసుదేవరెడ్డితోపాటు కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్, నల్లగొండ జిల్లాకు చెందిన గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకే్‌షరెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో వరంగల్, నల్గొండ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయం నుంచి పని చేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడమేంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకున్నామని, పల్లా కారణంగానే తమకు అధిష్ఠానం వద్ద ప్రాధాన్యం తగ్గుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితోపాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, మర్రి యాదవరెడ్డి తదితరులు ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పినా.. అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితోనే దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అధిష్ఠానంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికపై వీటి ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.