Priyanka Gandhi: తెలంగాణ గడ్డ నుంచే.. మోదీ ఓటమికి నాంది
ABN , Publish Date - May 12 , 2024 | 03:50 AM
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని... కాంగ్రె్‌సకు ఓటువేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తోందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.
ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటిచెప్పాలి.. ప్రధాని అబద్ధాలకోరు
పదేళ్లలో చేసిందేమిటో చెప్పలేక.. కన్నీళ్లు
ప్రాణాలు పోయినా రాజ్యాంగం మార్పునకు
భారతీయులు అంగీకరించరు
మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా?
ప్రజల మీద ఏఏ (అదానీ, అంబానీ) ట్యాక్స్
మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల
అనుబంధం.. నేను మీ సోదరిని
దేశం కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి
తాండూరు, కామారెడ్డి సభల్లో ప్రియాంక
హైదరాబాద్, కామారెడ్డి, మే 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని... కాంగ్రె్‌సకు ఓటువేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తోందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పదేళ్ల మోదీ పాలనలో దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఎలాంటి మేలు జరగలేదని, కార్పొరేట్ కంపెనీల అధిపతులకు మాత్రమే లబ్ధి జరిగిందని.. పేదలు ఆర్థికంగా మరింత నష్టపోయారని తెలిపారు. ‘దేశ పేద ప్రజల సంపదను ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టాడు. రైల్వేలు, పోర్టులు, విమాన, విద్యుత్ కాంట్రాక్టులను అదానీ, అంబానీలకు కట్టబెట్టారు. పెట్టుబడిదారులకు రూ.16లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. కానీ పేదలకు, రైతులకు ఒక్కరూపాయి కూడా మాఫీ చేయలేదు.
దేశంలోని ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో విద్వేషాలు సృష్టించడమే లక్ష్యంగా పనిచేశారే తప్ప దేశాభివృద్ధికి పాటు పడలేదు’ అని ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తాండూరులో నిర్వహించిన జనజాతరసభలో, కామారెడ్డిలో జరిపిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లలో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు శ్రమించి.. ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారని, బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక సూచించారు. ఈ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతమని, విద్వేషం వద్దు.. స్వచ్ఛమైన పాలన కావాలంటూ ఇక్కడి నుంచి సందేశం ఇవ్వాలని కోరారు. అవినీతిని అంతమొందిస్తాం, నల్లధనం వెనక్కు తీసుకొస్తామన్న నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎలక్టోరల్ బాండ్స్ వంటి అవినీతి స్కీములను తీసుకువచ్చిందని ప్రియాంక నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కడ మహిళలపై అత్యాచారాలు జరిగినా.. బాధితుల పక్షాన బీజేపీ నిలబడలేదని, అత్యాచారం చేసిన వారి పక్షానే ఆ పార్టీ నిలబడిందన్నారు. ‘దేశంలో అత్యున్నతమైన పదవి ప్రధాని పదవి. ఆ పదవిలో పదేళ్లుగా ఉన్న వ్యక్తి.. ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం చేయట్లేదు. వేదికలపైన కన్నీళ్లు పెట్టుకుంటారు. పచ్చి అబద్ధాలు చెబుతుంటారు. ఈ ప్రధాని దుర్భలుడు.. అబద్ధాల కోరు.
ప్రజల కోసం ఏమీ చేయలేదు కాబట్టే అబద్ధాలు మాట్లాడుతుంటారు’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపైనా పొద్దస్తమానం అబద్దాలే చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పత్రం.. ప్రజల సంపదను వారి జేబుల్లోకి చేర్చే పత్రం అని వివరించారు. పదేళ్ల పాలనలో ప్రజల కోసం మోదీ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించిన స్కీమ్‌లనే పేర్లు మార్చుకుని మోదీ ఫొటోలు పెట్టుకుని కొత్త పథకాలుగా ప్రజలముందు పెట్టారని ప్రియాంక ఆరోపించారు. ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ధనవంతుల కోసమే పని చేసిందని, పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, మధ్యతరగతి జీవుల కోసం ఏమీ చేయలేదన్నారు. పంటకు నష్టం వాటిల్లి.. కూతురు పెళ్లి, పిల్లల చదువులు వంటి ఖర్చులతో రైతులపై రుణభారం పెరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్నవ్యాపారుల నడ్డి విరిగి పోయిందన్నారు. రైతులు, కార్మికులు, స్టార్టప్ కంపెనీలు, ఐటీ రంగం ఆదాయాలు తగ్గిపోయాయని చెప్పారు.
సామాన్యులపై ఏఏ ట్యాక్స్
గడిచిన మూడేళ్లుగా సామాన్య ప్రజలకు వెచ్చించే బడ్జెట్ రూ.9 లక్షల కోట్ల మేర తగ్గిందని, అదే సమయంలో ధనవంతులపై పన్నుల భారం పెరగకపోగా.. వారికి ఉన్న రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. దేశంలోని సామాన్య ప్రజలు ఏఏ ట్యాక్స్‌ను భరిస్తున్నారని, ఏఏ అంటే అంబానీ, అదానీ అని.. వారిపై వేయాల్సిన ట్యాక్స్‌లను సామాన్య ప్రజలు భరిస్తున్నారని ప్రియాంక చెప్పారు. మీడియా కూడా వారి చేతిలోనే ఉండడంతో వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఈ పదేళ్లలో ఏం చేశామన్నది చెప్పి ఓటు అడిగే ధైర్యం ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గానికి లేకుండా పోయిందన్నారు.
ఇది ప్రజల రాజ్యాంగం
‘భారత రాజ్యాంగం.. ప్రజలు రాసుకున్న రాజ్యాంగం. మార్చడానికి ఇది మోదీ రాసిన రాజ్యాంగం కాదు. మన ముందు తరాల సంఘర్షణ నుంచి వచ్చిన రాజ్యాంగం ఇది. దాని ద్వారానే దేశ ప్రజలకు అధికారం, రక్షణ లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని మార్చడం కోసం దేశం అంతా తిరుగుతూ 400 సీట్లు ఇవ్వాలని మోదీ అడుగుతున్నారు. ఈ రాజ్యాంగం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు చెందినది. ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు కానీ.. రాజ్యాంగాన్ని మారుస్తామంటే భారతీయులు అంగీకరించరు’ అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పేదల సంక్షేమం కోసం ఎన్నో గ్యారెంటీ హామీలను ప్రకటించిందని, మహిళల ఖాతాలో ఏటా లక్ష రూపాయలు వేస్తామని, రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇస్తామని, జీఎస్టీని తొలగిస్తామని ప్రియాంక చెప్పారు.
తెలంగాణ ప్రజలతో నాది సోదరి బంధం
ఇందిరమ్మను తెలంగాణ ప్రజలు ఎంతగానో ప్రేమించారని, ప్రతిగా ఆమె కూడా తెలంగాణ ప్రజలకు ప్రేమను పంచారని ప్రియాంక గుర్తు చేశారు. తన తల్లి సోనియాగాంధీని ఈ రాష్ట్ర ప్రజలు తల్లిగా భావిస్తూ సోనియమ్మ అని పిలుస్తున్నారని, తాను కూడా రాష్ట్ర ప్రజలకు సోదరిణి అని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన తాము.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో హామీలు ఇచ్చామని, నేడు వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు వినడం, వారి కోసం పని చేయడమన్నది కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారని, తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ.500కు వస్తుం టే.. యూపీలో 1200 వెచ్చించాల్సి వస్తుందన్నారు.
మతం పేరుతో చిచ్చు
బీజేపీ వాళ్లు మతం గురించి మాట్లాడుతూ ప్రజల మధ్య విభజన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ.. హిందూ మత విరోధి అని, మొత్తం సంపద తీసుకుని వేరే వాళ్లకు ఇస్తుందనీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసలే కాంగ్రెస్ పార్టీ విధానమని, మతం పేరుతో అన్నదమ్ముల మధ్య విభేధాలు సృష్టిచడం, మనుషులను విడదీసి అధికారం దక్కించుకోవాలనుకోవడం, రాజ్యాంగాన్నే మార్చాలనుకోవడం పాప కార్యాలని ప్రియాంక పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారని, వారు సత్యాన్ని చాటి చెప్పాలని కోరారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగారు. వచ్చిందా? ఐఐఎం, కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూళ్లు, మెడికల్ కాలేజీలను అడిగారు. వాటిలో ఒక్కటైనా వచ్చిందా?’ అంటూ ప్రజలను ప్రశ్నించారు.
మన దగ్గర ఆర్, ఆర్‌ఆర్ ఉన్నారు
‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశారా? ఈ సినిమా చూసి ప్రపంచమంతా ఊగిపోయింది. మోదీ, ఆయన మంత్రులు.. నాటు నాటు డ్యాన్స్ వేసుకోనివ్వండి! మనదగ్గర ఆర్, ఆర్‌ఆర్ ఉన్నారని చెప్పండి. రాహుల్ ఆర్ అయితే.. రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్! వారిద్దరూ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తారు’ అని ప్రియాంక చెప్పారు.