Share News

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

ABN , Publish Date - May 11 , 2024 | 05:43 AM

తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్‌(రజాకార్‌) ట్యాక్స్‌ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్‌.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్‌.. ఢిల్లీది.

PM Modi: తెలంగాణలో.. ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌

  • ఒకటి ఢిల్లీ ఆర్‌.. రెండు తెలంగాణ ఆర్‌.. మూడోది రజాకార్‌

  • అందరికీ న్యాయం.. ఇదే మా ఐడియా ఆఫ్‌ ఇండియా

  • 4న దేశం గెలవబోతోంది.. దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు

  • లూటీ.. వారసత్వ రాజకీయాలు.. ఇదే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు

  • రాముణ్ని పూజిస్తే దేశద్రోహమా?.. ఇండీ కూటమితో భద్రం

  • బీఆర్‌ఎస్‌ నకలు కాంగ్రెస్‌.. కారుకు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే

  • బీఆర్‌ఎస్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదు

  • కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి..

  • అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు

  • ఎల్బీస్టేడియం, నారాయణపేట జనసభల్లో ప్రధాని మోదీ

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్‌(రజాకార్‌) ట్యాక్స్‌ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్‌.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్‌.. ఢిల్లీది. ఈ రెండు ‘ఆర్‌’లూ హైదరాబాద్‌ను, తెలంగాణను ఏటీఏంగా మార్చుకున్నాయి. నేను ఎవరి పేరూ ఎత్తలేదుగానీ.. డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌పై ఇక్కడి సీఎం స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. హైదరాబాద్‌లో మరో ఆర్‌ ట్యాక్స్‌ ఉంది. ఆర్‌... అంటే రజాకార్‌ ట్యాక్స్‌.. ఇది హైదరాబాద్‌ పాత నగరంలో కనిపిస్తుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుతో మజ్లిస్‌ ఈ పన్ను వసూలు చేస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘అందరికీ న్యాయం.. ఎవరినీ బుజ్జగించకపోవడం.. ఇదే ఐడియా ఆఫ్‌ ఇండియా’’ అని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో, సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన జనసభల్లో పాల్గొని ప్రసంగించారు.


పదేళ్ల కిందట ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన తమ పార్టీ బహిరంగసభను దేశ రాజకీయాల్లో ఓ మేలిమలుపుగా ఆయన అభివర్ణించారు. ఆ సభకు తాము టికెట్‌ పెడితే, జనం టికెట్‌ కొనుక్కొని మరీ వచ్చారని మోదీ గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్‌ వద్దు.. బీఆర్‌ఎస్‌ వద్దు.. ఎంఐఎం వద్దు.. బీజేపీకే ఓటేద్దాం.. గెలిపిద్దాం అని తెలంగాణ అంటోంది’’ అని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా అద్భుత స్పందన కనిపించిందని వివరించారు. ‘‘జూన్‌4న దేశం గెలువబోతోంది. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం గెలువబోతోంది. భారత్‌ వ్యతిరేకులు ఓడిపోబోతున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, సీఏఏ, యూనిఫాం సివిల్‌ కోడ్‌, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దును వ్యతిరేకిస్తున్నవాళ్లు ఓడిపోబోతున్నారు’’ అని మోదీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకం అని ఆయన ఆరోపించారు. మధ్య తరగతి వారు ఐస్‌క్రీంలపై ఖర్చుచేస్తూ ధరల పెరుగుదలను విమర్శిస్తారంటూ ఒక కాంగ్రెస్‌ నేత గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ మధ్యతరగతివారికి సంబంధించి కనీస ప్రస్తావన కూడా తన మేనిఫెస్టోలో చేయలేదు.. కానీ, మధ్య తరగతి వారి ఆస్తులను ఎక్స్‌రే తీస్తుందట! దానిని తమ ఓటుబ్యాంకు కోసం వినియోగించాలని యోచిస్తోంది’’ అని మోదీ ఆరోపించారు.


‘‘మీ సంపదపై మీ వారసులకు అధికారం ఉంటుందా? ఉండదా? మీ సంపదకు కోతపెట్టే ప్రభుత్వం మీకు అంగీకారమా?’’అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం ఇప్పుడు డిజిటల్‌ పవర్‌.. స్టార్టప్‌ పవర్‌.. ఆర్థిక శక్తి, అంతరిక్ష శక్తి అయిందని.. ఇదీ తన ట్రాక్‌ రికార్డ్‌ అని మోదీ వివరించారు. ‘‘లూటీ.. లూటీ.. సంతుష్టీకరణ.. వారసత్వం, ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం.. కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు’’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయాంలో దిల్‌సుఖ్‌నగర్‌లో సీరియల్‌ బాంబు పేలుళ్లు జరిగాయని.. హోటళ్లకు, సినిమాలకు వెళ్లినవారు బాంబు పేలుళ్లకు బలయ్యేవారని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇలాంటివి చాలా జరిగాయి.. కానీ, ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో బలమైన ఎన్డీయే ప్రభుత్వం ఉండడం వల్లే, దేశవ్యాప్తంగా పేలుళ్లు ఆగాయని స్పష్టం చేశారు. ఇది ఇండియా కూటమికి నచ్చట్లేదని.. అందేకే మోదీని తొలగించేందుకు ఒక్కటై మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. దేశం ఉగ్రవాదుల కబంధ హస్తాల్లోకి వెళ్లకూడదని పిలుపునిచ్చారు. ‘‘ఐడియా ఆఫ్‌ ఇండియా అంటే.. వేల సంవత్సరాల సంస్కృతి, వారసత్వం.. సత్యమేవ జయతే.. వసుధైవ కుటుంబం.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి, నరుడే నారాయణుడు, మానవసేవే మాధవ సేవ, దేవుడే సర్వోన్నతుడనే భావన.. ఐడియా ఆఫ్‌ ఇండియా అంటే అందరికీ న్యాయం చేయడం.. కొందరిని బుజ్జగించకపోవడం’’అని వ్యాఖ్యానించారు. ఈ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మాట్లాడుతోందని దుయ్యబట్టారు.


లక్షల కోట్లు ఇచ్చినా..

గడిచిన పదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు ఇచ్చినా.. అవి ప్రజలకు ఉపయెగపడకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కరప్షన్‌ (అవినీతి) ఏటీఎంలా మార్చుకున్నాయని.. నారాయణపేట సభలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎ్‌సకు జిరాక్స్‌లా మారిందని.. మొన్నటివరకు రాష్ట్రంలో అఽధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ జేబులు నింపుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అలాగే చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లుగా చేసిన లూటీని కాంగ్రెస్‌ కొన్ని నెలల్లోనే చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అవినీతిపై ఇప్పటికీ పెన్ను కదల్చడం లేదని ఎద్దేవాచేశారు. 2009లో ఇక్కడి నుంచి కేసీఆర్‌ను గెలిపిస్తే.. తెలంగాణ వచ్చాక ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాను, ఈ ప్రాంతాన్ని మరిచిపోయారని మండిపడ్డారు. కొత్త సీఎం కూడా ఇక్కడి నుంచే గెలిచారని, ఆయన కూడా ఢిల్లీ హైకమాండ్‌ ముందు తలవంచుకొని వారిని ఖుషీ చేయడానికి లెక్కాపత్రాలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈ పరిస్థితి మార్చాలంటే ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను ఢిల్లీకి పంపాలని కోరారు. మహబూబ్‌నగర్‌ సీటును గెలుచుకునేందుకు ఒక మహిళను అవమానించేలా సీఎం మాట్లాడుతున్నారని, 13వ తేదీన జరిగే పోలింగ్‌లో దీనికి జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో పూర్తి శక్తి పెట్టి పనిచేస్తున్న కాంగ్రెస్‌.. మాదిగల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదన్నారు.


నరనరానా జాతి వివక్ష..

కాంగ్రెస్‌ నరనరానా జాతి వివక్ష ఉందని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ యువరాజు (రాహుల్‌) సిద్ధాంతకర్త (పిట్రోడా) దేశ ప్రజలను చైనీయులతో, ఆఫ్రికన్‌లతో పోల్చారని మండిపడ్డారు. ‘‘సదరు సిద్ధాంతకర్త యువరాజుకు ఖతర్నాక్‌ ఐడియాలను ట్యూషన్‌ చెప్పి మరీ నేర్పించారు. ఆ ట్యూషన్‌ చెప్పే వ్యక్తి మరో మాట చెప్పాడు.. రామ మందిరానికి వెళ్లి శ్రీరాముడిని దర్శించుకోవడం, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం పొరపాటు అట. శ్రీరాముణ్ని పూజించడం తప్పా? అదేమైనా దేశద్రోహమా’’ అంటూ పిట్రోడాపై నిప్పులు చెరిగారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌, ఇండీ కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రె్‌సతోపాటు అలాంటి పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని.. అందులో భాగంగానే హైదరాబాద్‌ను ఎంఐఎంకు ధారాదత్తం చేశాయని విమర్శించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్‌ తగ్గించి మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ యోచిస్తోంది. బీసీల కోటాను తగ్గించి ముస్లింలకు కేటాయించడం వల్ల బీసీలు ఎంత నష్టపోయారో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనిపించింది. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకే కాంగ్రెస్‌ తలపోస్తోంది’’అని మండిపడ్డారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని అన్నారు.

Updated Date - May 11 , 2024 | 05:44 AM