Private Universities: ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేనట్టే
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:56 AM
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు ప్రస్తుతానికి లేనట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, నియామకాల్లో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వం ఇంతకు ముందు భావించింది.
కొత్తగా ఐదింటికి అనుమతులు
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు ప్రస్తుతానికి లేనట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, నియామకాల్లో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వం ఇంతకు ముందు భావించింది. ఈ మేరకు కొంత కసరత్తును కూడా జరిగింది. ఈ రిజర్వేషన్ పద్ధతిని అమలు పరుస్తున్న ఇతర రాష్ట్రాల్లోని విధానంపై అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించారు. దీనిపై కొంత చర్చ కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దీని అమలుకు సంబంధిన ఆలోచనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యల్ని తీసుకోలేదు. శ్రీనిధి, గురునానక్, ఎంఎన్‌ఆర్, కావేరి, నిక్మార్ వంటి ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు న్యాయ శాఖ గెజిట్‌ను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును 2022 సెప్టెంబరు 13న ప్రవేశపెట్టింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై ఈ బిల్లును కొంత కాలం పెండింగ్‌లో పెట్టి, కొంత వివాదం కొనసాగిన తర్వాత ప్రభుత్వానికి తిరిగి పంపించారు. అనంతరం 2023 ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, గవర్నర్ అనుమతికి పంపించారు. అప్పటి నుంచి ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో న్యాయ శాఖ గెజిట్‌ను జారీ చేసింది. రిజర్వేషన్ల ప్రస్తావన మాత్రం ఇందులో లేదు.