Agriculture budget: రుణమాఫీకి 26 వేల కోట్లే!
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:06 AM
రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది.
రూ.31 వేల కోట్లలో రూ.5 వేల కోట్లు కోత.. ‘రైతు భరోసా’ పెరిగినా బడ్జెట్ మాత్రం అంతే!
వ్యవసాయ, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
నీటిపారుదల శాఖ, విద్యుత్ సబ్సిడీ ఇందులోనే!
మొత్తం బడ్జెట్‌లో 25 శాతం ‘సాగు’కే కేటాయింపు
10లక్షల మంది రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది. నీటి పారుదల శాఖకు ప్రగతి పద్దులో కేటాయించిన రూ.10,829 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద ఇచ్చే రూ.11,500 కోట్లను కూడా సాగు బడ్జెట్ లెక్కలోనే కలిపేశారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, పంటలకు బోనస్, విత్తనాల పంపిణీ, ఇతర అనుబంధ రంగాలకు కలిపి ఈ కేటాయింపులు చేశారు. రెండు లక్షల రుణమాఫీ పథకం ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలున్న 11.34 లక్షల మందికి రూ.6,035 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకానికి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని, ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర, ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 44 లక్షల లోన్ అకౌంట్లకు రుణమాఫీ చేయటానికి రూ.31 వేల కోట్లు అవసరమని పేర్కొంది. అయితే ఈ బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లే కేటాయించారు.
ఇదీ రైతు భరోసా లెక్క
రైతు భరోసా పథకానికి ప్రభుత్వం బడ్జెట్ పెంచలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంఽధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పంటకు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. 2023-24లో రైతుబంధు బడ్జెట్ రూ.15,075 వేల కోట్లు కాగా.. ఇప్పుడు కూడా రూ.15,075 కోట్లే కేటాయించారు. సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి మినహాయిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని, ఆ నిధులే ఎకరానికి రూ.2,500 చొప్పున ఏడాదికి పెరిగే రూ.5 వేలకు సరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు చర్చించి.. విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించింది. గతంలో కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇచ్చేవారు. ఇప్పుడు సుమారు 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత పడే అవకాశాలు ఉన్నాయి.
మిగతా కేటాయింపులు ఇలా..
ఉచిత పంటల బీమా పథకానికి రూ.1,300 కోట్లు కేటాయించింది. రైతు బీమా పథకం రెన్యువల్ కోసం రూ.1,590 కోట్లు కేటాయించింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున పంపిణీ చేసే పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించింది. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోటాలో రూ.1,800 కోట్లు కేటాయించింది. విత్తన సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రూ.109 కోట్లు కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు కేవలం రూ.50 కోట్లతో సరిపెట్టింది. వ్యవసాయశాఖ ప్రయోగశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు, విస్తరణ విభాగానికి రూ.3.50 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.6 కోట్లు, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ఏర్పాటుకు రూ.47.53 కోట్లు, రైతుబంధు సమితికి రూ.కోటి చొప్పున కేటాయించింది.
రైతు సంక్షేమానికి పెద్దపీట: తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా రూ.72,659 కోట్లు సాగు రంగానికి కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.