Share News

Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు

ABN , Publish Date - May 07 , 2024 | 11:39 AM

సికింద్రాబాద్‌(Secunderabad) పార్లమెంట్‌ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రెండు, మూడు రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.

Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు

- ప్రచారంలో రంగులు మారుస్తున్న నాయకులు

- ద్వితీయ నేతల నుంచి బస్తీ నేతల వరకు అదేతీరు

- ఓటర్ల కంటే నాయకులపైనే పార్టీల గురి

- ప్రత్యర్థి పార్టీ నేతలపై నజర్‌

- కండువా కప్పేందుకు చర్చలు

సికింద్రాబాద్‌(Secunderabad) పార్లమెంట్‌ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రెండు, మూడు రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. వ్యక్తులు వారే.. కానీ, వారు కప్పుకొనే కండువాలు.. వేయాలని చెప్పే పార్టీల గుర్తులు మారిపోయాయి.

మల్కాజిగిరి(Malkajigiri) లోక్‌సభలోని ఓ బస్తీ నాయకుడు చెప్పిందే స్థానికులకు వేదం. ఆయన చెప్పిన గుర్తుకే ప్రజలు ఓటు వేస్తారు. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు ఆయన ద్వారా మంత్రాంగం మొదలు పెట్టారు. ఏం కావాలో చెప్పమంటూ బేరసారాలు పూర్తి చేశారు.

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. పాదయాత్రలు, అగ్రనేతల రోడ్‌ షోలతో పాటు.. అంతర్గతంగా బస్తీలు, కాలనీల నాయకులు. ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు కృషి చేస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నా.. క్షణం తీరిక లేకుండా ఎన్నికల్లో గెలుపునకు పాటుపడుతున్నారు. ప్రచార విరామ సమయంలో బస్తీ, కుల, యువజన సంఘాల గంపగుత్త ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు ఓటు వేస్తే ఏమిస్తాం.. మున్ముందు ఏం చేస్తాం..’ అన్నది వివరిస్తూ ఓట్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డిమాండ్‌ తక్కువగా ఉన్నా.. ఎలాగైనా గెలవాలని పట్టుదల ఉన్న పార్టీలు, అభ్యర్థులు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామనే హామీలతో పాటు కొన్నిచోట్ల ఓటుకు నోటు ఇచ్చేందుకూ సిద్ధమవుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రధాని రాక సందర్భంగా నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

city4.jpg

హామీల కన్నా.. ప్రలోభంపైనే..

గెలిచాక అది చేస్తాం.. ఇది చేస్తాం అన్న హామీల కంటే ఇప్పటికిప్పుడు ఓట్లు పొందడం ఎలా..? అన్న దానిపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఆయా పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలను వెంట తీసుకెళుతూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. పలుకుబడి నేతలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే నజరానాలతో తమవైపు తిప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో ఓ పార్టీ అభ్యర్థి భారీగా ఖర్చు చేస్తున్నాడు. పార్టీ కార్పొరేటర్లకు ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చొప్పున ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నియోజకవర్గంలో మరో అభ్యర్థి యువజన, కాలనీ సంఘాలకు రూ.లక్షల నజరానా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు కాలనీ సంఘాల ప్రతినిధులకు మందు, విందు ఏర్పాటుచేసి ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. సికింద్రాబాద్‌లో ఓ అభ్యర్థి పలువురు నమ్మకస్తులకు బస్తీ ఓట్ల కొనుగోలు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

ఇదికూడా చదవండి: Telangana Rains: తెలంగాణకు గుడ్ న్యూస్.. అప్పటి వరకు వర్షాలు

కండువా కప్పి..

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గ్రేటర్‌లో పార్టీల పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్(BRS)కు చెందిన 14 మంది కార్పొరేటర్లు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ కార్పొరేట్‌ బీజేపీ నుంచి హస్తం గూటికి చేరారు. ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీల నుంచి మరికొందరిని చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. డివిజన్‌ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అసంతృప్తులకు గాలం వేసి కండువా కప్పాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‏లోని కీలక నేతల నమ్మకస్తులు ఇందులో కీలక భూమిక పోషిస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్‌, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తదితర పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. నాయకుల చేరికతో క్షేత్రస్థాయిలో పరిణామాలూ మారుతున్నాయి.

ఇదికూడా చదవండి: Konda Visveshwar Reddy: ఆటోడ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌..

Read Latest News and Telangana News Here

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 11:39 AM