Share News

Seethakka: జైలుకు వెళ్తే యోగా చేస్తానన్న కేటీఆర్‌లో ఇప్పుడెందుకు భయం?

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:55 AM

ఫార్ములా-ఈ కేసులో జైలుకు వెళితే యోగా చేసుకుంటానన్న కేటీఆర్‌.. ఇప్పుడెందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టులకు వెళితే తప్పు పట్టిన ఆయనే.. ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారని నిలదీశారు.

Seethakka: జైలుకు వెళ్తే యోగా చేస్తానన్న కేటీఆర్‌లో ఇప్పుడెందుకు భయం?

  • తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవచ్చుగా

  • కేటీఆర్‌ తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు

  • గవర్నర్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన కేసుపై సభలో చర్చ ఎందుకు: సీతక్క

  • కార్‌ రేసింగ్‌ అక్రమాలపై ఆధారాలున్నాయి: మహేశ్‌కుమార్‌

  • కేటీఆర్‌పై ప్రజాస్వామ్యబద్ధంగా కేసు నమోదు: మల్లు రవి

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కేసులో జైలుకు వెళితే యోగా చేసుకుంటానన్న కేటీఆర్‌.. ఇప్పుడెందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టులకు వెళితే తప్పు పట్టిన ఆయనే.. ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారని నిలదీశారు. ఫార్ములా-ఈ కేసులో ఆయన తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా అన్నారు. కేటీఆర్‌ తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియాతో ఆమె చిట్‌చాట్‌గా మాట్లాడారు. పార్లమెంటులో అంబేడ్కర్‌కు, అసెంబ్లీలో దళిత స్పీకర్‌కు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌ ఆమోదం తీసుకుని ఫార్ములా ఈ రేస్‌కు కేటీఆర్‌ డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు.


ఈ అంశంపైన ఇప్పుడు చర్చకు పట్టు పడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. బీఏసీ సమావేశంలో ఎందుకు చర్చ కోరలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం లేదన్నారు. కాగా కేటిఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరిందని, ఆయనపై నమోదైన కేసు సక్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అక్రమాలు జరిగినట్లుగా పలు ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కడిగిన ముత్యాన్ని.. స్వాతిముత్యాన్ని అంటూ కేటీఆర్‌ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్‌లో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. కేటీఆర్‌పై చట్టపరంగా కేసు నమోదవడంతో ఈవిషయంపై ఇక కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్‌ న్యాయనిపుణుల సలహా తీసుకొని కేసుకు అనుమతించారని, అలాంటప్పుడు అక్రమకేసు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కారు రేసు పేరుతో నిధులు గోల్‌మాల్‌ చేసి.. ఇప్పుడు సుద్దపూసలా కేటీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.


గవర్నర్‌ అనుమతి తర్వాతే కేసు: మల్లురవి

ఫార్ములా రేస్‌ కేసులో కేటీఆర్‌పై ప్రజాస్వామ్య బద్థంగా కేసు నమోదు చేసినట్టు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. కేసు నమోదులో ఎక్కడా తొందర పడలేదని, గవర్నర్‌ అనమతి తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. కేటీఆర్‌ ఏం చెప్పాలని అనుకుంటున్నారో విచారణ అధికారులకు చెప్పొచ్చునని సూచించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. తమకు అసెంబ్లీలో కొంత బలం ఉందనే ధైర్యంతో సభను నడవకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో రక్తపాతంలేని విప్లవాత్మక పాలనను అందిస్తున్నామని తెలిపారు. బీజేపీకి ప్రజల సమస్యలపై చర్చించే ఉద్దేశమే లేదని, పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రజల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 03:55 AM