Share News

Crop Loans: రుణమాఫీయే అజెండా!

ABN , Publish Date - May 18 , 2024 | 05:28 AM

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.

Crop Loans: రుణమాఫీయే అజెండా!

  • నేటి కేబినెట్‌ భేటీలో దీనిపైనే ప్రధాన చర్చ

  • నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం

  • అజెండాలో ఏపీతో విభజన సమస్యలు

  • మార్కెట్‌ విలువలు.. రిజిస్ట్రేషన్‌ చార్జీల సవరణ

  • ధాన్యం కొనుగోళ్లు.. వానాకాలం పంట విధానం

  • విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ

  • కేబినెట్‌ సమావేశం నిర్వహణకు ఈసీకి లేఖ

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసినా.. కౌంటింగ్‌ ప్రక్రియ మిగిలే ఉన్నందున కేబినెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. అందుకే మంత్రివర్గ సమావేశ నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.


అనుమతి రావడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, కేబినెట్‌ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతోపాటు విభజన సమస్యలు, రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీల సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తదితర అంశాలు చర్చకు రానున్నాయి.


రెండు నెలల తరువాత కేబినెట్‌ భేటీ..

నిజానికి రెండు నెలల సుదీర్ఘ విరామానంతరం కేబినెట్‌ సమావేశం కాబోతోంది. మార్చి 12న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి 3,500పక్కా ఇళ్లను కేటాయిస్తూ మొత్తం 4.5లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో పాలనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సహా అధికార యంత్రాంగం తిరిగి పాలన వ్యవహారాల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో.. రుణమాఫీ కోసం నిధుల ఆవశ్యకత, సమీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై దృష్టి సారించనుంది. ఈ పథకం కింద ఎంత మంది రైతులు అర్హులవుతారు, ఎంత మేర నిధులను సర్దాలి, ప్రస్తుతం నెలవారీగా ఖజానాలో మిగులుతున్న నిధులెన్ని వంటి వివరాలను కేబినెట్‌లో సమీక్షించనున్నారు. అనంతరం రుణమాఫీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ముందున్న మరో ప్రధాన సమస్య.. విభజన అంశాలు. రాష్ట్ర విభజన జరిగి ఈ జూన్‌ 2తో పదేళ్లకాలం పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూలు 9లో ఉన్న 91 కార్పొరేషన్లు, షెడ్యూలు 10లోని 142 సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తిగా కొలిక్కిరాలేదు. ముఖ్యంగా కార్పొరేషన్ల అప్పులు, ఆస్తుల పంపిణీ పెద్ద చిక్కుముడిగా ఉంది. ఆర్టీసీ, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, పౌర సరఫరాల సంస్థలు, విద్యుత్తు సంస్థల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవడానికి అనుసరించాల్సి విధానంపై కేబినెట్‌లో చర్చించనున్నారు.


ఆదాయ మార్గాల అన్వేషణపై చర్చ..

రుణమాఫీ పథకానికి నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం.. ఇందుకోసం రాష్ట్రంలోని భూములు, స్థలాల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీలను సవరించాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సింగా అధికారులను సీఎం ఆదేశించారు. అయితే... ఈ విలువలను పెంచితే ఎంతమేర పెంచాలి? ఎంత ఆదాయం సమకూరుతుంది? అన్న అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇతర ఆదాయ వనరుల సేకరణపైనా చర్చించనుంది. గనుల సీనరేజీ చార్జీలు, రాయల్టీలను పెంచడంపైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కొనుగోళ్ల పురోగతిని సమీక్షిస్తూనే.. మిగిలిన ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేయడం, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు, వచ్చే వానాకాలం సీజన్‌కు పంట విధానంపై కేబినెట్‌ చర్చిస్తుంది. కాగా, కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులపై ఇటీవలే నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని సిఫారసులు, తదుపరి కార్యాచరణపై కేబినెట్‌ భేటీలో చర్చిస్తారు. జూన్‌ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. మరోవైపు వరంగల్‌-ఖమ్మ-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల వ్యూహం, ప్రచారంపైనా చర్చించే అవకాశాలున్నాయి.

Updated Date - May 18 , 2024 | 05:35 AM