Share News

Exam Schedule: డిసెంబరు 15, 16 తేదీల్లో.. గ్రూప్‌-2 పరీక్షలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:54 AM

రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గురువారం ప్రకటించింది.

Exam Schedule: డిసెంబరు 15, 16 తేదీల్లో.. గ్రూప్‌-2 పరీక్షలు

  • కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన టీజీపీఎస్సీ

  • రోజూ రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ

  • సెప్టెంబరు 18 నుంచి డీఎడ్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గురువారం ప్రకటించింది. దీని ప్రకారం డిసెంబరు 15, 16 తేదీల్లో రెండు సెషన్లలో (ఉదయం, సాయంత్రం) ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


వీటి భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇంతకు ముందు ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఉండటంతో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా డిసెంబరు 15, 16 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.


డిసెంబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌) పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 (చరిత్ర, పాలిటీ అండ్‌ సొసైటీ) పరీక్ష, డిసెంబరు 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-3 (ఎకానమీ అండ్‌ డెవల్‌పమెంట్‌) పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-4 (తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అభ్యర్థులకు అధికారులు సూచించారు.


  • సెప్టెంబరు 18 నుంచి డీఎడ్‌ పరీక్షలు

డీఎడ్‌ రెండో సంవత్సరం పరీక్షలను సెప్టెంబరు 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 6 పేపర్లకు నిర్వహించే ఈ పరీక్షలు సెప్టెంబరు 24న ముగుస్తాయి.

Updated Date - Aug 23 , 2024 | 02:54 AM