Hyderabad: 14 నుంచి ‘ప్రజా విజయోత్సవాలు’: భట్టి
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:11 AM
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున.. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున.. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా, ప్రభుత్వ విజన్‌ను తెలియజేసేలా ‘ప్రజా విజయోత్సవాల’ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, దాదాపు రూ.18 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశామని పేర్కొన్నారు.
మూతపడిన ములుగు జిల్లాలోని కమలాపూర్ రేయాన్స్ పరిశ్రమను రూ.4 వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామన్నారు. నెహ్రూ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ ‘ప్రజా విజయోత్సవాల’ సందర్భంగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన డిసెంబరు 9న హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఉత్సవాల మధ్య కాలంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి శనివారం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ధరణి సమస్యలు, ప్రతిపాదన దశలో ఉన్న కొత్త రెవెన్యూ రికవరీ చట్టం గురించి కోదండరెడ్డి వివరించారు.