Share News

TG state govt : ఆరేళ్లలో అదనంగా20 గిగా వాట్ల గ్రీన్‌ పవర్‌!

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:44 AM

రానున్న ఆరేళ్లలో అదనంగా 20 గిగా వాట్ల (20 వేల మెగావాట్ల) గ్రీన్‌ పవర్‌ (హరిత విద్యుత్‌) ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

TG state govt : ఆరేళ్లలో అదనంగా20 గిగా వాట్ల గ్రీన్‌  పవర్‌!

  • కేంద్రానికి తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

  • ‘రీ-ఇన్వెస్ట్’ లో ప్రమాణ పత్రం సమర్పణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆరేళ్లలో అదనంగా 20 గిగా వాట్ల (20 వేల మెగావాట్ల) గ్రీన్‌ పవర్‌ (హరిత విద్యుత్‌) ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు (రీ-ఇన్వెస్ట్‌) సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేష్‌ జోషికి ‘శపథ్‌ పత్ర్‌’ (ప్రమాణ పత్రం) సమర్పించారు. రాష్ట్రాల వారీగా గ్రీన్‌ పవర్‌ ఉత్పాదక సామర్థ్యం పెంచాలని కేంద్రం యోచిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా 2030 కల్లా 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌, 2 వేల మెగావాట్ల పవన, జల విద్యుత్‌, పంప్డ్‌ స్టోరేజీ విధానంలో 6 వేల మెగావాట్లు అదనంగా ఉత్పత్తి చేస్తామని తెలంగాణ నివేదించింది. దీనికోసం త్వరలోనే నూతన ఇంధన విధానం ప్రకటించనుంది. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌర విద్యుత్‌ ఉత్పాదనకు అవకాశం ఉండగా పవన విద్యుత్‌కు కూడా అనుకూలతలు ఉన్నాయని గుర్తు చేసింది.

పంప్డ్‌ స్టోరేజీ హైడ్రోపవర్‌ (పీఎ్‌సహెచ్‌) కోసం కోల్‌బెల్ట్‌లో నిల్వలు అయిపోయిన ఓపెన్‌ కాస్టు గనులను వినియోగించుకోనున్నారు. ఈ విధానంలో పైభాగంలో ఒకటి, దిగువన మరొకటి రిజర్వాయర్లు పెట్టి, రెండింటి మధ్య నీటిని టర్బయిన్ల గుండా వెళ్లేట్లు చేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి, ఏడాదంతా వాడుకునే అవకాశం ఉంటుంది.

అలాగే శ్రీశై లం రిజర్వాయర్‌ను దిగువ రిజర్వాయర్‌గా వాడుకొని... కొండపై ఒక రిజర్వాయర్‌ నిర్మిస్తే డిమాండ్‌ ఉన్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడానికి వీలుంది. కాగా, ఇప్పటికే పురపాలక, నీటిపారుదల శాఖకు చెందిన ఖాళీ భూముల్లో సోలార్‌ప్లాంట్లు పెట్టాలని, సర్కారు బడుల భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం లో ప్రస్తుతం 7662.98 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో చిన్నతరహా జల విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా 90.87 మెగావాట్లు, 128.10 మెగావాట్ల పవన విద్యుత్‌, బయోమాస్‌, చెరుకు పిప్పి కలిపి 158.10 మెగావాట్లు, బయోమాస్‌ ద్వారా 3.30 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు.

Updated Date - Sep 18 , 2024 | 05:44 AM