Share News

Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది

ABN , Publish Date - Sep 04 , 2024 | 06:30 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు విలయం నుంచి బాధితులు తేరుకుంటున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు.

Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది

ఖమ్మం, సెప్టెంబర్ 04: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు విలయం నుంచి బాధితులు తేరుకుంటున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటికే విద్యుత్ పునరుద్దరణ జరిగిందని చెప్పారు.


కేవలం మూడు రోజుల్లోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకు వచ్చినట్లు ఆయన వివరించారు. వరద బాధితులకు ఆహారం, నిత్యవసర సరుకులను చేతన ఫౌండేషన్‌తోపాటు పలు స్వచ్చంద సంస్థలు పంపిణి చేశాయని పేర్కొన్నారు. పొరుగునున్న వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పారిశుద్ద్య సిబ్బందిని రప్పించామన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచిందన్నారు. ఇక గురువారం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు.


తద్వారా నష్టం వివరాలను సేకరిస్తామని తెలిపారు. అలాగే వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. వరద నీటి ముంపు ప్రాంతాల్లో వంట చేసుకునే అవకాశం లేని వారికి టిఫిన్‌తోపాటు భోజనాలు సైతం అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.


మరోవైపు అంటు రోగాలు ప్రబలకుండా శానిటేషన్‌తోపాటు హెల్త్ క్యాంపులు సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు. వరద బాధితులకు రగ్గులు, దుప్పట్లతోపాటు ఆయిల్ ప్యాకెట్లు సైతం పంపిణి చేస్తున్నామన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరదలపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు వార్తలు కోసం..

Updated Date - Sep 04 , 2024 | 06:41 PM