సంఘాలన్నీ సీపీఎస్ ఉద్యోగులను వాడుకున్నాయి
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:31 AM
రాష్ట్రంలోని 147 సంఘాలు ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎ్‌ససీపీఎ్‌సఈయూ)మాత్రమే సీపీఎస్ అంతమే పంతంగా ఉద్యమాలు చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు.
సీపీఎస్ అంతమే టీఎ్‌ససీపీఎ్‌సఈయూ పంతం
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
సీపీఎస్ ఉద్యోగ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటస్వామి
వరంగల్ ఎడ్యుకేషన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 147 సంఘాలు ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎ్‌ససీపీఎ్‌సఈయూ)మాత్రమే సీపీఎస్ అంతమే పంతంగా ఉద్యమాలు చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో కాకతి కదనభేరి బహిరంగ సభను ఆదివారం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... 2004 సెప్టెంబరు 1న నాటి ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి సంఘాలు వ్యతిరేకించకపోవడంతోనే ఆ విధానం అమలైందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పెన్షన్ విధానం మార్పునకు అవకాశం ఉన్నా ఎమ్మెల్సీలు, వ్యవస్థీకృత సంఘాలు ప్రతిపాదనలు చేయకపోవడంతో సీపీఎ్‌సనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. 2025 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నెత్తిన యూపీఎస్ భూతాన్ని ఎత్తనున్నందని, అప్పుడైనా ఉపాధ్యాయ, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తే పాత పెన్షన్ విధానం అమలయ్యే అవకాశముందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని సంఘాలు సీపీఎస్ ఉద్యోగులను వాటి అవసరాలకు మాత్రమే వాడుకున్నాయని ఆరోపించారు. సీపీఎస్ విధానాన్ని, జీవో నంబరు 317 అన్యాయాన్ని వ్యవస్థీకృత సంఘాలు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేస్తుందనే భావిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల గొంతుకను శాసనమండలిలో వినిపించేందుకు సీపీఎస్ ఉద్యోగుల సంఘం పక్షాన డాక్టర్ కొలిపాక వెంకటస్వామిని వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.