Dengue Fever: డెంగీతో ఇద్దరి మృతి..
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:22 AM
డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.
మృతుల్లో ఒకరు ఐదో తరగతి విద్యార్థి
సిద్దిపేటఅర్బన్/పాపన్నపేట, ఆగస్టు 30 : డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లికి చెందిన సుతారి కనకవ్వ(28)కు రెండు నెలల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. పరీక్షలు చేయించగా డెంగీగా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి చికిత్స పొందుతోంది. పది రోజుల క్రితం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఆమె కోలుకోలేదు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందింది.
ఈమెకుభర్త నర్సింహులు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రోజువారీ కూలీతో కనకవ్వ కుటుంబం జీవిస్తుందని, ఆసుపత్రి ఖర్చులకే రూ.25 లక్షలకు పైగా అప్పులు అయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామానికి చెందిన వడ్ల రాజు పెద్ద కుమారుడు వడ్ల హర్షిత్(11) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా డెంగీ అని తేలింది. మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసినా తగ్గకపోవడంతో కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో గురువారం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందాడు.