ఈ సందర్భాల్లో స్కూల్, కాలేజీ ఫీజు చెల్లించనక్కర్లేదు : విద్యా కమిషన్ సిఫార్సులు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:58 PM
ప్రైవేట్ స్కూల్స్ (Schools) లేదా కాలేజీలలో విద్యార్థి చదువుతున్న సమయంలో తండ్రి లేదా కుటుంబాన్ని పోషించే వాళ్లు చనిపోతే ఫీజు కట్ట లేదన్న కారణంతో ఆ విద్యార్థిని మధ్యలో వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదని పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ (Telangana Education Commission) సరికొత్త సిఫారస్సులు చేసింది. ప్రైవేట్ స్కూల్స్ (Schools) లేదా కాలేజీలలో విద్యార్థి చదువుతున్న సమయంలో తండ్రి లేదా కుటుంబాన్ని పోషించే వాళ్లు చనిపోతే ఫీజు కట్ట లేదన్న కారణంతో ఆ విద్యార్థిని మధ్యలో వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదని పేర్కొంది. ప్రతీ ఫౌండేషన్ స్కూల్ లోనూ ఎఐ ల్యాబ్ (AI lab) ఉండాలని చెప్పింది. మధ్యాహ్న భోజనానికీ ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్), విద్యార్థుల తల్లిదండ్రులు చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దు, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు రెండేళ్లకోసారి నిబంధనల మేరకు ఫీజులు పెంచుకోవచ్చని కూడా తన సిఫార్సు నివేదికలో ప్రభుత్వానికి కమిషన్ తెలిపింది.
స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, మధ్యాహ్న భోజనం పథకం పటిష్ఠ అమలు తదితర విషయాలపై కమిషన్ సమగ్ర నివేదిక అందించింది. పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా ప్రభుత్వానికి కమిషన్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చింది. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని అభిప్రాయపడింది. ఈ సిఫార్సుల అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఈ నివేదికలను కమిషన్ ఇవాళ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలను పంపే వీలుంది.
నిబంధనలను ఉల్లంఘించిన ఆయా విద్యాసంస్థలకు జరిమానా, లేదంటే అనుమతులను కూడా రద్దు చేయాలని కూడా తన నివేదికలో పొందుపర్చింది. మధ్యాహ్న భోజనం పథకంలో వారానికి 4 రోజులు కోడిగుడ్లు, రెండు రోజులు అరటి పండ్లు ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వారికి ఒక్కొక్కరికి ఇస్తున్న రూ.8.69 ధరను రూ.13.45కు పెంచాలని, ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారికి రూ.11.79 నుంచి రూ.18.60లకు, తొమ్మిది, పది తరగతుల వారికి రూ.11.79 నుంచి రూ.19.14లకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. కమిషన్ చేసిన సిఫార్సుల పూర్తి నివేదికలను తన వెబ్ సైట్లో (https://tec.telangana.gov.in/TEC/) పొందుపర్చింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి అధ్యక్షతన గతేడాది సెప్టెంబర్ 4వ తేదీన ప్రభుత్వం ఈ కమిషన్ నియమించగా ఇవాళ తన సిఫార్సుల రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించింది.