Seethakka: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించాలి
ABN , Publish Date - Jan 17 , 2024 | 08:19 PM
కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని.. అందుకోసం తెలంగాణ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Minister Kishan Reddy ) కృషి చేయాలని మంత్రి సీతక్క ( Minister Seethakka ) కోరారు.
ములుగు: కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని.. అందుకోసం తెలంగాణ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Minister Kishan Reddy ) కృషి చేయాలని మంత్రి సీతక్క ( Minister Seethakka ) కోరారు. బుధవారం మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఆసియా ఖండంలో అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ మహా జాతర అని చెప్పారు. గత సంవత్సరం వరదలతో మేడారం చిన్నాభిన్నమైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతరకు ఇప్పటికే 75 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. జాతర విజయవంతం కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతీ ఏటా జాతరకు నిధులిచ్చే కేంద్రం ఈసారి కూడా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. జాతరలో శాశ్వత నిర్మాణాలు చెప్పాడుతున్నామని చెప్పారు. భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంచనాల ఆధారంగా 75 కోట్లు, మరో 30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తామన్నారు.
కేసీఆర్ ఆ హామీ మరిచారు
తాత్కాలిక నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 200 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మేడారం అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హాయంలో ఇచ్చిన హామీ ఏమైందని తరచూ ప్రశ్నించినట్లు చెప్పారు. జాతర ఏర్పాట్ల కోసం కావాల్సిన నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందన్నారు. జాతరకు 60 రోజుల ముందే రేవంత్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. జాతర పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. జాతర పనులు, నిర్వహణలో రాజీపడేది లేదన్నారు. ఇద్దరం మహిళా మంత్రులం తమ ఇలవేల్పుగా అమ్మవార్లను కొలుస్తామని చెప్పారు. అధికారులు జాతరకు సహకరించాలని సమ్మక్క, సారలమ్మల మహిమ ప్రపంచవ్యాప్తంగా తెలుసునని మంత్రి సీతక్క అన్నారు.