Yearender 2024: మౌనంగా ఎదిగిన రాహుల్ గాంధీ
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:28 PM
రాహుల్ 'భారత్ జోడో యాత్ర', 'భారత్ జోడో న్యాయ యాత్ర'లతో దేశం నలుమూలల ప్రజలతో మమేకమయ్యారు. సామాన్యులకు చేరువయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక విమర్శలు, ఎగతాళి మాటలను మౌనంగా తిప్పికొడుతూ 2024లో ఎదిగారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత పదవి దక్కే విధంగా నడిపించారు. ప్రజాదరణను పెంచుకుంటూ దూసుకెళ్ళారు. 'భారత్ జోడో యాత్ర', 'భారత్ జోడో న్యాయ యాత్ర'లతో దేశం నలుమూలల ప్రజలతో మమేకమయ్యారు. సామాన్యులకు చేరువయ్యారు.
Yearender 2024: ప్రజల మధ్య సంబంధాలే మోదీ విదేశాంగ విధానం
లోక్‌సభ ఎన్నికల అనంతరం 'ఇండియా టుడే' నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే'లో రాహుల్ ప్రజాదరణ గతం కంటే బాగా పెరిగినట్లు వెల్లడైంది. ఈ సర్వేలో మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ రేటింగ్ 50 శాతం కన్నా తక్కువకు అంటే 49.1 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో రాహుల్ రేటింగ్ 13.8 శాతం నుంచి 22.4 శాతానికి పెరిగింది. మోదీ రేటింగ్ 2019 ఆగస్టులో 71 శాతం ఉండేది. అంటే ఆయన ప్రజాదరణ రానురానూ తగ్గుతుండగా, రాహుల్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజాదరణను పెంచుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతల మధ్య పోటీలో కూడా రాహుల్ గాంధీ మెరుగైన స్థితిలో ఉన్నారు. ఆయన 32.3 శాతం మంది మద్దతు పొందగా, మమత బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ ఆయన కన్నా సుమారు 25 పాయింట్లు వెనుకబడి ఉన్నారు. అయితే, రాహుల్‌కు లభిస్తున్న ప్రజాదరణను ఓట్ల రూపంలో మలచుకోవడంలో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ స్థానిక నాయకత్వం ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఓటర్ల చేత ఓట్లు వేయించుకోలేకపోతున్నది. నాయకుడి ప్రజాదరణను పార్టీకి ఉపయోగపడేలా చేసుకోలేకపోవడం కాంగ్రెస్ దుస్థితి.
ఉదాహరణకు, హర్యానా శాసన సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సభలకు మోదీ సభల కన్నా ఎక్కువ మంది ప్రజలు తరలివచ్చారు. బీజేపీ వద్ద ఇబ్బడిముబ్బడిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేదు. కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌ను వెక్కిరించాయి. అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలలో ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు లభించాయి. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆ కూటమి ఆశలు నెరవేరలేదు.
మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు భారత దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలను ఆయన తట్టుకుని నిలిచారు. తనదైన శైలిలో ఆరెస్సెస్, బీజేపీల సిద్ధాంతాలను ఎండగడుతూ సాగిపోతున్నారు. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా వెన్ను చూపకుండా ముందడుగు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలను తెరుస్తానని, విద్వేషాన్ని పారదోలుతానని గర్జిస్తూ, మోదీకి దీటైన నేతగా ఎదుగుతున్నారు.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News