Share News

Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 17 , 2025 | 02:58 AM

పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత వంద రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది.

 Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

  • ఆర్టీసీ బస్సుల్లో హాల్‌ టికెట్‌ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణం

  • ఒత్తిడికి గురికాకుండా రాయండి

  • విద్యార్థులకు సీఎం ఆల్‌ ది బెస్ట్‌

  • అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ

అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత వంద రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. మెరుగ్గా ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేలా, అంతంతమాత్రంగా ఉన్నవారు సులభంగా ఉత్తీర్ణులయ్యేలా సమాయత్తం చేసింది. నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అని పరీక్షా కేంద్రాలను మొబైల్‌ రహితంగా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలైన ల్యాప్‍ట్యాప్‍లు, కెమెరాలు, ట్యాబ్‌లు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటివాటిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది టెన్త్‌ విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ అమలు చేశారు. మొత్తం విద్యార్థుల్లో 51,069 మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయనున్నారు. ఒడియాలో 838 మంది, తమిళంలో 194 మంది, కన్నడలో 623 మంది, హిందీలో 16 మంది, ఉర్దూలో 2,471 మంది పరీక్షలు రాయనున్నారు. వీరితో పాటు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ విద్యార్థులకూ సోమవారం నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.


పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. అకడమిక్‌ ప్రయాణంలో టెన్త్‌ పరీక్షలు కీలక మైలురాలు లాంటివని, ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

ప్రయాణం ఫ్రీ!: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరుకోవచ్చునని ప్రకటించింది.

మొత్తం విద్యార్థులు 6,49,884

బాలురు 3,36,225

బాలికలు 3,13,659

పరీక్షా కేంద్రాలు 3,450

ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు 156

సమస్యాత్మక కేంద్రాలు 163


ఈ వార్తలు కూడా చదవండి:

Stalled Projects: అభివృద్ధికి మళ్లీ మోక్షం!

Municipal Development : అమరావతికి మరో రూ.11వేల కోట్లు!

Updated Date - Mar 17 , 2025 | 07:10 AM