Reunion : కాశీలో తప్పిపోయి.. 18 ఏళ్ల తర్వాత ఇంటికి..
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:47 AM
పద్దెనిమిదేళ్ల క్రితం కాశీలో తప్పిపోయిన మహిళ మంగళవారం హఠాత్తుగా స్వగ్రామంలో ప్రత్యక్షమవ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఆర్మీ జవాన్ల సాయంతో సొంతూరు చేరిన మహిళ
జామి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పద్దెనిమిదేళ్ల క్రితం కాశీలో తప్పిపోయిన మహిళ మంగళవారం హఠాత్తుగా స్వగ్రామంలో ప్రత్యక్షమవ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గ్రామస్థులు సైతం సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఇద్దరు ఆర్మీ జవాన్ల సాయంతో ఆమె ఇంటికి చేరుకోగా, వారికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలుపుకొంది. విజయనగరం జిల్లా జామి మండలం విజనిగిరి గ్రామానికి చెందిన వాకాడ సత్యనారాయణ, కొండమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి 18 ఏళ్ల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. అక్కడ కొండమ్మ వారి నుంచి తప్పిపోయింది. భర్త, కుటుంబీకులు పది రోజులు అక్కడే ఉండి ఎంత వెదికినా ఆమె ఆచూకీ లభించక, స్వగ్రామానికి తిరిగొచ్చారు. కొండమ్మ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. ఇటీవల ఆమె భర్త మంచానపడ్డారు. కుటుంబ సభ్యులంతా.. కొండమ్మ ఇక లేదనుకుని ఆశలు వదిలేసుకున్నారు. ఈ నేపథ్యంలో 15రోజుల క్రితం శ్రీనగర్‌లో కొండమ్మ భిక్షాటన చేస్తుండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న విజయనగరానికి చెందిన భారత ఆర్మీజవాన్లు సైలాడ సాయి, శ్రీమణికంఠ చూశారు. కొండమ్మ తెలుగులో మాట్లాడాన్ని గమనించారు. ఆమె నుంచి వివరాలు రాబట్టారు. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించింది. తర్వాత విజయనగరంలో తమకు తెలిసిన ఆర్మీ అధికారుల వద్దకు పంపి అక్కడే వైద్యం చేయించారు. అనంతరం ఈ ఇద్దరు జవాన్లు కొండమ్మను శనివారం స్వగ్రామం విజనిగిరి తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.