R. Narayanamurthy : డీలిమిటేషన్‌పై అదానీ, అంబానీ, మోదీ కుట్ర!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:08 AM
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరదీసిందని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విమర్శించారు.

జనాభా ప్రకారం చేపడితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం
కమ్యూనిస్టులు ఏకం కావాలి
సీఎం చంద్రబాబు నిర్ణయం భేష్
సినీనటుడు ఆర్.నారాయణమూర్తి
నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరదీసిందని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విమర్శించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే.. అది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. ‘‘నాడు దేశ క్షేమం కోసం కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి, భారీ స్థాయిలో పన్నులు కడుతున్న దక్షణాది రాష్ట్రాలుకు అన్యాయం జరుగుతుంది. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో నేడు జనాభా ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతం వారు రాజ్యం ఏలడం కేంద్ర పెద్దలకు కావాలి. అందుకే జనాభా దామాషా మేరకు ఎంపీ సీట్లు కేటాయింపునకు కుట్ర పన్నారు జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల ఏర్పాటు.. అంబానీ, అదానీ, మోదీ, అమిత్‌షాల కుట్రే’’ అని నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీకాకుకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తిలో అమరవీరుల స్థూపం వద్ద ప్రముఖ కథారచయిత అట్టాడ అప్పలనాయుడు రాసిన ‘కామ్రేడ్ మామిడి అప్పలసూరి’ జీవిత చరిత్ర పుస్కక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు రావడానికి సంపదను తరలించుకుపోవడమే ప్రధాన కారణమన్నారు. ‘‘భూతలం మీద పేదవాడి ఆకలి ఉన్నంత కాలం.. దోపిడీ జరుగుతున్నంత కాలం... మావోయిజం అంతం కాదు. కమ్యూనిస్టులు ఎన్ని పోరాటాలు చేసినా.. ఎన్ని త్యాగాలు చేసినా... ప్రజలు పట్టంచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్య ఉద్యమాల కోసం మీరంతా(వామపక్షాలు) ఏకం కావాలి. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టులు ఐక్యం కావాలి’’ అని నారాయణమూర్తి పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నలుగురు పిల్లలను కనండి అని చెబుతున్న నిర్ణయం మంచిదేనన్నారు. అయితే, జనాభా ప్రాతిపదికగా కేంద్రం చేపడుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల పున్వరిభజన విధానాన్ని కూడా సీఎం ఖండించాలని కోరారు. ‘‘మీకు దండం పెడుతున్నా.. సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, వామపక్షాల నాయకులు, వైసీపీ అధినేత జగన్ కూడా ఈ విధానాన్ని ఖండించాలి’’ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం(ఎల్), సీపీఐ(ఎంఎల్), ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.