WHIP KALAVA: రైతు రథాలు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:42 PM
అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు.

రాయదుర్గం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలో రైతు రథం పఽథకం ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేశామన్నారు. తిరిగి ఆ పథకాన్ని పునరుద్ధరించి, రానున్న ఏడాది నుంచి మండలానికి కనీసం 50 ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారు. టీడీపీ హయాంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. రైతుల సౌకర్యార్థం 113 పథకాలు అమలు చేశామన్నారు. తరువాతి వైకాపా ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి రైతాంగానికి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. మైక్రో ఇరిగేషన కింద డ్రిప్, స్ర్పింక్లర్లపై కేంద్రం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. దీంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. పండ్ల తోటల సాగుపై ఎక్కువ ఆధారపడ్డ సీమ రైతులు సాగునీటి కొరత వల్ల డ్రిప్, స్ర్పింక్లర్ వ్యవసాయం చేస్తున్నారన్నారు. సీమ అనావృష్టి పరిస్థితులను గుర్తించి పదెకరాల మెట్ట కంటే ఎక్కువున్న రైతులకు కూడా నిబంధనలు సడలించి 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇవ్వాలని సంబంధిత మంత్రికి కాలవ విజ్ఞప్తి చేశారు.