cpi అర్హులైన ప్లంబర్లకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:22 AM
పట్టణంలో 650-2 సర్వేనెంబరులో అర్హులైన తమకు పట్టాలిచ్చి.. న్యాయం చేయాలని వందలాది మంది ప్లంబర్లు సోమవారం పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.

ధర్మవరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలో 650-2 సర్వేనెంబరులో అర్హులైన తమకు పట్టాలిచ్చి.. న్యాయం చేయాలని వందలాది మంది ప్లంబర్లు సోమవారం పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన గాంధీసర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, సిరికల్చర్ కార్యాలయ సర్కిల్ మీదుగా 650-2 సర్వేనెంబర్ స్థలాల వరకు సాగింది. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ రమణ మాట్లాడారు. యూనియన పేరుతో ముగ్గురు వ్యక్తులే వారి కుటుంబసభ్యుల పేరుతో అక్రమంగా పట్టాలు పొందారని ఆరోపించారు. తహసీల్దార్ నటరాజ్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దీనిపై నివేదిక తయారు చేసి కలెక్టర్ అందించామని, ఆయన ఆదేశాల మేరకు అవినీతిపరులపై చర్యలు తీసుకొని.. అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు.