Water నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:11 AM
తాగునీటి కోసం కేతిరెడ్డికాలనీ లోని ఎల్-4 ప్రజలు రోడ్డెక్కారు. పట్టణంలోని కేతిరెడ్డికాలనీ ఎల్-4లో గత పది రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదంటూ సోమవారం ఉదయం రోడ్డుపై నిరసన చేపట్టారు. తాగునీటి సమస్యపై పలు మార్లు మున్సిపల్ డీఈకి విన్నవించామని, అయినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంటపాటు కేతిరెడ్డి కాలనీవాసుల ఆందోళన
ధర్మవరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం కేతిరెడ్డికాలనీ లోని ఎల్-4 ప్రజలు రోడ్డెక్కారు. పట్టణంలోని కేతిరెడ్డికాలనీ ఎల్-4లో గత పది రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదంటూ సోమవారం ఉదయం రోడ్డుపై నిరసన చేపట్టారు. తాగునీటి సమస్యపై పలు మార్లు మున్సిపల్ డీఈకి విన్నవించామని, అయినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయమే కూలి పనులకు వెళ్లే తాము తాగునీరు రాకపోవ డంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం కూలిపనులు వదిలేసి ఇంటి వద్ద ఉంటూ పక్క కాలనీలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన దాదాపు గంటపైగా జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ నిరసన చేస్తున్న ప్రాంతానికి వచ్చి కాలనీ ప్రజలతో మాట్లాడారు. పైపులైన పనులు చేస్తుండటం వల్ల సమస్య తలెత్తిందని, తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు నిరసన విరమించారు.