FLYOVER WORKS: దౌర్జన్యంగా పనులు చేయడం ఏంటి?
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:48 PM
ఫ్లైవోర్ పనులు దౌర్జన్యంగా చేయడమేంటని మండల కేంద్రంలోని ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు. అండర్ పాస్ నిర్మాణం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డి.హీరేహాళ్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఫ్లైవోర్ పనులు దౌర్జన్యంగా చేయడమేంటని మండల కేంద్రంలోని ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు. అండర్ పాస్ నిర్మాణం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న అధికారులు, పనులు చేస్తున్న సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు. ప్రజలు మాట్లాడుతూ నిర్మాణ పనులను నిలిపివేయాలని కోర్టుకు విన్నవించామని, కోర్టు నుంచి ఉత్తర్వులు రాకనే దౌర్జన్యంగా పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వీరికి ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం మీదుగా నేషనల్ హైవే వెళుతున్నందున రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకల కోసం అండర్‌పాస్ ఏర్పాటు చేశారన్నారు. ఇందుకు సంబంధించి రెండు నెలల క్రితం ఎస్‌ఆర్‌సీ బిల్డర్స్ పనులు ప్రారంభించిందన్నారు. నిర్మాణ పనులు చిన్న పరిమాణంలో ఉన్నందున భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మూడునెలల క్రితమే గ్రామస్థులు పనులను అడ్డుకొని ఆపివేయించారన్నారు. ఆంధ్ర, కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారన్నారు. మంగళవారం నేషనల్ హైవే అధికారులు కాంట్రాక్టర్‌కు సంబంధించిన వారు వాహనాల ద్వారా పనులు ప్రారంభించేందుకు పూనుకున్నారన్నారు. గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునే ప్రయత్నం చేశామన్నారు. ఈ సమయంలో అక్కడ పనులు చేపట్టే సిబ్బందికి గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి, ఇనచార్జి తహసీల్దార్ మునివేలు అక్కడికి చేరుకున్నారు. అధికారులు కూడా దీనికి సంబంధించి పనులను అడ్డుకోవద్దని చెప్పగా అధికారులే ఈ కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం సమంజసం కాదని గ్రామస్థులు తహసీల్దార్‌పై మండిపడ్డారు. కోర్టుతీర్పు వెలువడే వరకు ఎక్కడా ఎటువంటి పరిస్థితులలో పనులు చేపట్టడం కుదరదని గ్రామస్థులు తేల్చి చెప్పారు.