AP Police : తులసిబాబు దర్యాప్తునకు సహకరించడం లేదు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:44 AM
మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో పిటిషనర్ కామేపల్లి తులసిబాబు దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరఫున...

పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వాదనలు
రఘురామ ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించిన కోర్టు
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో పిటిషనర్ కామేపల్లి తులసిబాబు దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తుల వివరాలు వెల్లడి కావాలంటే తులసిబాబు కస్టోడియల్ విచారణ అవసరమని వివరించారు. సీఐడీ కస్టడీలో రఘురామను కొట్టిన వ్యక్తుల్లో తులసిబాబు ఉన్నారన్నారు. కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను కొనసాగించడం సమంజసం కాదన్నారు. పిటిషనర్‌ను విచారణకు పిలిచిన వెంటనే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, మేజిస్ట్రేట్ జ్యుడీషియల్ కస్టడీ ఉత్తర్వులు జారీచేయగానే అత్యవసరంగా బెయిల్ పిటిషన్ వేశారని వివరించారు. పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని పోసాని కోరారు. రఘురామ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దాన్ని అనుమతించాలని కోరారు. కౌంటర్ వేసేందుకు సమయమివ్వాలని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. తులసిబాబు తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. రఘురామ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే విచారణను వాయిదా వేయాలని కోరడం సరికాదన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు... రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.