Share News

ఔషధ దుకాణాలపై కానరాని తనిఖీలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:44 PM

జిల్లాలో ఔషధ దుకాణాలపై నియంత్రణ లేకుండా పోయింది. గిరిజన ప్రాంతంలో ఔషధ దుకాణాలపై అధికారులు ఏనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు.

ఔషధ దుకాణాలపై కానరాని తనిఖీలు

కొరవడిన పర్యవేక్షణ

దుకాణాల్లో కనిపించని ఫార్మసిస్టులు

తనిఖీలు చేయని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

పాడేరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఔషధ దుకాణాలపై నియంత్రణ లేకుండా పోయింది. గిరిజన ప్రాంతంలో ఔషధ దుకాణాలపై అధికారులు ఏనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఔషధాల నియంత్రణ తనిఖీ అధికారులు నియమించకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. సాధారణంగా నెలలో ఒకసారిగా ఔషధ దుకాణాలను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీలు చేయాల్సివున్నది. కాలం చెల్లిన మందులు, నిషేధిత మందులు విక్రయిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అయితే గిరిజన ప్రాంతంలో మందుల దుకాణాలపై కనీస పర్యవేక్షణ లేకుండా పోయింది. ఔషధ దుకాణాల్లో వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌ ఆధారంగా ఫార్మసిస్టు మందులు విక్రయించాలి. మందుల దుకాణాల్లో ఎక్కడా ఫార్మసిస్టులు కనిపించడం లేదు. అనుభవం లేని వ్యక్తులే మందులను విక్రయిస్తున్నారు. మందుల విక్రయించడంలోనే ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. ఎటువంటి ఔషధాలనైనా వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే విక్రయిస్తున్నారు. దీనికితోడు ఆర్‌ఎంపీ వైద్యులు సైతం మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీల క్లీనిక్స్‌పై కూడా తనిఖీలు చేయడం లేదు. పాడేరు నియోజకవర్గం ప్రాంత దుకాణాలను నర్సీపట్నం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అరకు నియోజక వర్గం దుకాణాలకు అనకాపల్లి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు చేయాల్సి వున్నది. జిల్లాలో ఔషధ దుకాణాల తనిఖీల కోసం ఎటువంటి అధికారి లేకపోవడం వల్ల దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఔషధ దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని ప్రాంతీయులు కోరుతున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:44 PM