మహిళలకు శఠగోపం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:49 PM
పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్‌ఫోను స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతు న్నారు.

లక్షాధికారులను చేస్తామని నట్టేట ముంచాడు
నగలు, డబ్బుతో ఉడాయించిన మహిళ ఫ బ్యాంకు సీఈవో వెంకటరమణ
పోలీసులను ఆశ్రయిస్తున్న మహిళా బ్యాంకు బాధితులు
కోవెలకుంట్ల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్‌ఫోను స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతు న్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ్ మహిళలు ఒక్కొక్కరు రూ.లక్షల్లో సొమ్మును ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేయడంతో ఆ డబ్బు తిరిగి వస్తుందో రాదోనని వారిలో తీవ్ర ఆందోళన నెల కొంది. కొందరు మహిళలు సీఈవో స్వస్థలం కడపకు వెళ్లి అతని ఇంటి వద్ద ఆరా తీయగా సీఈవో ఆచూకీ లేకపోవడంతో వారికి నిరాశ మిగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన హరిప్రియ అనే మహిళను బ్యాంకు ట్రెజరర్‌గా నియమిస్తున్నామని చెప్పి నమ్మ బలికి ఆమె నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు, ఐదు లక్షల నగదు తీసుకున్నారు. బంగారు లాకరులో ఉంచుతామని చెప్పి అధిక వడ్డీ పేరుతో మోసం చేశాడని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల బాలసుబ్బయ్య ఈ సంస్థలో ఆరు లక్షలు డిపాజిట్ చేశాడు. బాండ్లు మెచ్యూర్ కావడంతో అతనికి వడ్డీతో కలిపి సుమారు రూ.7.40 లక్షలు రావాల్సి ఉంది. జననీ బ్యాంకు సిబ్బంది బాలసుబ్బయ్యకు చెక్ ఇచ్చారు. నగదు డ్రా చేసుకునేందుకు అతనికి సేవింగ్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా జననీ మహిళా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. మహిళా బ్యాంకు సీఈవో వెంకటరమణకు ఫోను చేయగా ఆఫోను స్విచ్చాఫ్ చేసి ఉండడం, 20 రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతు న్నారు. దీంతో డిపాజిటర్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి బ్యాంకు సిబ్బందిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించగా వెంకటరమణ ఫోను స్విచ్చాఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని తెలిపారు. గత 20 రోజులుగా అందు బాటులో లేడని పోలీసులకు వివరించారు. తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహి ళలు రూ.లక్షల్లో డిపాజిట్ చేశారని పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి తెలిపారు.
ఎవరీ వెంకటరమణ
కడప పట్టణానికి చెందిన వెంకటరమణ స్థానికంగా ఉన్న పరిచయాలు ఆసరాగా చేసుకుని నం ద్యాల జిల్లాలో ఐదు బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు. కోవెలకుంట్లతో పాటు చాగలమర్రి, బనగానపల్లె, నంద్యాల తదితర చోట్ల జననీ మ్యాక్స్ సంస్థ పేరుతో జననీ పరస్పర సహాయ సహకార సొదుపు సంఘం కార్యాలయాలు తెరిచాడు. ఆ సంస్థ ద్వారా డిపాజిట్లపై రూపాయి వడ్డీ ఆ డిపాజిట్‌కు నగదుపై రుణం తీసుకుంటే ఒకటిన్నర రూపాయి చొప్పున వడ్డీ తీసుకుంటూ నాలుగు సంవత్సరా లుగా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. వేలాది మంది మహిళల నుంచి సుమారు రూ.2కోట్ల మేర భారీ మొత్తంతో డిపాజిట్లు సేకరించినట్లు తెలిసింది. ఈ సంస్థలో డబ్బు పొదుపు చేసిన డిపాజిటర్లు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో వారికి చెల్లించేందుకు నగదు అందుబాటులో లేకపోవ డంతో ఆ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి అధికం కావడం, డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో సీఈవో వెంకటరమణ డిపాజిటర్ల నగదు, బంగారం స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.