Share News

మొదలైన ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:49 PM

జిల్లాలో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 15 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 12,173 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

మొదలైన ‘పది’ పరీక్షలు
పరీక్ష రాస్తున్న విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 15 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 12,173 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షలకు జిల్లా అధికారయంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ కూడా కాపీయింగ్‌, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. పరీక్షలు మొదటిరోజు కావడంతో విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందు నుంచే కేంద్రాలకు చేరుకోగా, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా వారికి తోడుగా వచ్చి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు కేంద్రాల వద్దనే ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగగా, 9 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. ఐదు నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ ఇవ్వడంతో ఒకటి, రెండు, మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలలోపు వచ్చిన విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించడంతో విద్యార్థులు, వారితల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డబుల్‌ డెస్క్‌ ఫర్నిచర్‌, గాలి, వెలుతురు, మంచినీటి వసతికల్పించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పరీక్షా కేంద్రంలో వైద్యఆర్యోగసిబ్బందిని అత్యవసర వైద్యసేవల కోసం అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్సు సెంటర్లను పరీక్ష పూర్తయ్యే వరకు బంద్‌ చేయించారు. మొదటిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 12,188 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకావలసి ఉండగా 15 మంది గైర్హాజరయ్యారు. అలాగే 15 మంది ప్రైవేట్‌ వారికి 9 మంది పరీక్షలు రాయగా ఆరుగురు గైర్హాజరయ్యారు. రెగ్యులర్‌, ప్రైవేట్‌ కలిపి 24మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈవో సీహెచ్‌విఎస్‌ జనార్ధన్‌రావు తెలిపారు. జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని, 73 పరీక్షా కేంద్రాల్లో 38 కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసి ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు పరీక్షల నిర్వహణను పరిశీలించి, పలు సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు ఒక పరీక్షా కేంద్రాన్ని, జిల్లా అదనపు కలెక్టర్‌ మూడు కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి నాలుగు పరీక్షా కేంద్రాలను, ప్రత్యేక తనిఖీ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈవో తెలిపారు. ఎక్కడ కూడా కాపీయింగ్‌ కానీ, ఇతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:49 PM