Share News

సర్కేడియన్‌ వి యాప్‌ ద్వారా గుండె వ్యాధుల నిర్ధారణ

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:43 PM

సర్కేడియన్‌ వి యాప్‌ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు నిర్థారించడం జరుగుతుందని జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర అన్నారు.

సర్కేడియన్‌ వి యాప్‌ ద్వారా గుండె వ్యాధుల నిర్ధారణ
రోగులను సర్కేడియన్‌ వీ యాప్‌తో తనిఖీ చేస్తున్న సిద్ధార్ధ్‌. పక్కనే సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర

పాడేరు జీజీహెచ్‌ 250 మంది రోగులను పరీక్షించిన సిద్ధార్ధ్‌

10 మందికి గుండె సంబంధిత వ్యాధులున్నట్టు గుర్తింపు

పాడేరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సర్కేడియన్‌ వి యాప్‌ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు నిర్థారించడం జరుగుతుందని జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆస్పత్రిలో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి నంద్యాల సిద్ధార్ధ్‌ అభివృద్ధి చేసిన సర్కేడియన్‌ వి యాప్‌ ద్వారా 250 మందికి పరీక్షలు నిర్వహించగా.. పది మందిలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించామన్నారు. పది మందికి జనరల్‌ మెడిసిన్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ సురేశ్వర రెడ్డి టూడీ ఎకో, ఈసీడీ పరీక్షలు నిర్వహించారు. వారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్థారించి, కార్డియాలజీ సేవల కోసం తరలించామన్నారు. ఈ స్ర్కీనింగ్‌ పరీక్షలు శనివారం కూడా ఆస్పత్రిలో నిర్వహిస్తామని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 14 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి కనిపెట్టిన ఈ సర్కేడియన్‌ వి యాప్‌ ఏఐ ఉపయోగించి కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తిస్తుందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కేడియన్‌ వి యాప్‌ను అభివృద్ధి చేసిన విద్యార్థి సిద్ధార్ధ్‌ను అభినందించారన్నారు. కలెక్టర్‌ అభ్యర్థన మేరకు సిద్ధార్ధ్‌ పాడేరు వచ్చి పరీక్షలు నిర్వహించడం గొప్పతనమన్నారు. భవిష్యత్తులో సిద్ధార్ధ్‌ మరిన్ని ఏఐ ఆవిష్కరణలు రూపొందించాలని సూపరింటెండెంట్‌ విశ్వమిత్ర ఆకాంక్షించారు.

Updated Date - Mar 21 , 2025 | 11:43 PM