Share News

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:47 PM

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు.

 పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
హుజూరాబాద్‌లో మొక్కలు నాటుతున్న ప్రఫుల్‌ దేశాయ్‌

హుజూరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా స్వచ్ఛ భారత్‌.. స్వచ్ఛ హుజూరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ప్రత్యేకాధికారి ప్రఫుల్‌ దేశాయ్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మొక్కలు నాటారు. వేసవి కాలం దృష్ట్యా నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం, ఇంటింటికీ చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి హైస్కూల్‌ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ హుజూరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజు కూరగాయలు, కిరాణ సామగ్రి కొనుగోలు చేయుటకు బట్ట సంచులను మాత్రమే వినియోగించాలన్నారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, ప్రజలకు తడి, పొడి చెత్తను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐఈసీ ఎక్స్‌పర్ట్‌ ఫణి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పద్మ, ఏఈ సాంబరాజు, మేనేజర్‌ భూపాల్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్‌, ఎండీ రషీద్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:47 PM