మెడికల్ షాపులపై విజిలెన్స్ మెరుపు దాడులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:49 PM
నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్, పోలీసు అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు.

ఉల్లంఘనలకు పాల్పడిన పదిమంది యజమానులపై కేసులు నమోదు
నంద్యాల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్, పోలీసు అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై నిర్వహించిన ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపులు, ఏజన్సీలపై దాడులు జరిగాయి. జిల్లా విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు 22 మంది అధికారుల బృందం ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఏక కాలంలో దాడులకు పాల్పడడంతో మెడికల్ ఏజన్సీలు, షాపుల యజమానులు బెంబేలెత్తిపోయారు. నార్కోటిక్ డ్రగ్స్‌కు సంబంధించిన ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. యజమానులు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలకు తెరలేపారనేది అధికారుల దాడుల్లో బట్టబయలైంది. కాలం చెల్లిన మందుల అమ్మకాలు, డాక్టర్ల ప్రిస్కిప్షన్లు లేకుండానే మందుల అమ్మకాలు, లైసెన్స్‌కు మించి పరిధి దాటి డ్రగ్స్ నిల్వ చేయడం, ఏజన్సీ, మెడికల్ షాపుల్లో స్టాక్‌కు సంబంధించిన బిల్లులు లేకపోవడం, రికార్డులు సరిగా నిర్వహించకపోవడం వంటివి అధికారులు గుర్తించారు. కాస్మొటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ సెక్షన్-65 ప్రకారం స్కంద, వెంకటేశ్వర, షణ్ముఖ, శ్రీలలితతో పాటు మరో ఆరు షాపులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ యుగంధర్‌బాబు, ఇంజనీర్ ఆనంద్, సివిల్ సీఐలు ఆదినారాయణరెడ్డి, మారుతీ శంకర్, శాంద్‌బాషా, ముగ్గురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.