Share News

AP High Court : తులసిబాబుకు నో బెయిల్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:06 AM

మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు...

AP High Court : తులసిబాబుకు నో బెయిల్‌

  • పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

అమరావతి/ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. తులసిబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తులసిబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు జరిగాయి. పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘‘రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో తులసిబాబు పాత్ర ఉందని నిర్ధారిస్తూ ఆయన స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే సీఐడీ, పిటిషనర్‌కు ఉన్న సాన్నిహిత్యం తెలుస్తుంది. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో పిటిషనర్‌ పాత్రపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని న్యాయమూర్తిని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. కాగా, తులసిబాబును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఒంగోలు పోలీసులు శుక్రవారం తిరిగి గుంటూరు జైలులో అప్పగించారు. తులసిబాబును గురువారం ఉదయం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఒంగోలుకు తరలించారు. విచారణాధికారి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ గురువారం రాత్రి వరకు ఆయనను విచారించారు. అనంతరం, తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం ఒంగోలు రిమ్స్‌లోపరీక్షల అనంతరం గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి తిరిగి జైలుకు తరలించాలని ఆదేశించారు.

Updated Date - Feb 15 , 2025 | 06:07 AM