Tirumala: ఆ హోటళ్లకు అనుమతులు రద్దు
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:58 AM
తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణితో కలిసి సంప్రదాయ వస్త్రధారణతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు.

ఏడుకొండల్లో వ్యాపారీకరణను అనుమతించం
అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన 35.32 ఎకరాలను రద్దు చేస్తున్నాం
అన్నిరాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు
గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి నూతన ట్రస్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వితరణ
అన్నదానానికి రూ.44 లక్షల విరాళం
కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
తిరుమల, మార్చి 21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఏడుకొండల్లో వ్యాపారీకరణను (కమర్షియలైజేషన్) అనుమతించబోమని, వాటి పరిధిలో గత ప్రభుత్వం హోటళ్ల నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణితో కలిసి సంప్రదాయ వస్త్రధారణతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పేరిట ఒకరోజు అన్నప్రసాద కార్యక్రమానికి రూ.44 లక్షలు విరాళంగా అందించారు. మనవడితో కలిసి చంద్రబాబు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘నా ప్రఽథమ ప్రాధాన్యం శ్రీవేంకటేశ్వరస్వామి. ఏడుకొండలు శ్రీవారి సొంతం.
వీటిని అపవిత్రం చేయకూడదు, అందువల్లే గత ప్రభుత్వంలో ముంతాజ్, ఏఆర్‌కే, దేవ్‌లోక్‌కు ఏడుకొండలకు అనుకుని ఉన్న ప్రాంతంలో ఇచ్చిన 35.32 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో హోటళ్లు కడుతున్న ఒబెరాయ్ సంస్థ, అలిపిరిలో తమ హోటల్ పేరు మారుస్తామని, శాకాహారం మాత్రమే పెడతామని చెప్పినప్పటికీ ఏడుకొండలు ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదని తేల్చిచెప్పామన్నారు. అవసరమైతే రోడ్డుకు అవతలి వైపు నిర్మించుకోవాలని సూచించానని చెప్పారు. ఏపీ టూరిజం పరిధిలోని స్థలాన్ని కూడా టీటీడీకే అప్పజెప్పేలా చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ‘‘అమరావతిలో ఇటీవల జరిగిన శ్రీవారి కల్యాణం రాజధానికి నూతన శోభను తెచ్చింది. ఈ సందర్భంగా నేను నూతన సంకల్పం చేశాను. చాలా గ్రామాల్లో ఆలయాలు లేవు. వాటి నిర్మాణం కోసం నూతన ట్రస్టును ఏర్పాటు చేస్తాం. శ్రీవాణిట్రస్టుకు వచ్చే నిధులను కూడా ఈ నూతన ట్రస్టులో పెడతాం. ప్రస్తుతానికి ఈ ట్రస్టుకు ‘శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ నిధి’ అనే పేరును అనుకుంటున్నాం. త్వరలోనే టీటీడీ ఓ మంచి పేరు నిర్ణయిస్తుంది.’’ అని చంద్రబాబు తెలిపారు.
హథిరాంజీమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయాల నిర్వహణలో స్థానిక భక్తుల భాగస్వామ్యం పెంచుతామని తెలిపారు. టీటీడీ తరహాలో మిగిలిన ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. రాష్ట్రంలో అద్భుత టెంపుల్ ఎకో సిస్టమ్ ఉందని తెలిపారు. ‘‘ రూ.20 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు రెవెన్యూ వచ్చే ఆలయాలు ఏడు, రూ.ఐదు కోట్లపైబడి ఆలయాలు వచ్చేవి 13 ఉన్నాయి. రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి టూరిస్టులకు అనుకూలంగా మలుస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు. శ్రీవారి ఆలయాల్లో పనిచేసే వ్యక్తులు హిందువులే అయి ఉండాలని స్పష్టం చేశారు.
అరెస్టు చేయిస్తానని చెప్పా..
గతంలో అధికారులు తన వద్దకు వచ్చి తిరుమలలో నీళ్లు లేని కారణంగా, మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయాలని కోరారని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘వాళ్లను గట్టిగా హెచ్చరించా. 90నుంచి 95 రోజుల్లో కల్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీళ్లు తీసుకువచ్చేలా పైప్‌లైన్ ఏర్పాటుచేయండి. లేకుంటే అరెస్ట్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాను.’’ అని తెలిపారు. అంతకుముందు.. చంద్రబాబు కుటుంబసభ్యులకు మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చక బృందం ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అన్నదానం మా ఆనవాయితీ: బాబు
‘‘మా ఇంటి కులదైవం వేంకటేశ్వరస్వామి. మా దేవాన్ష్ పుట్టినప్పటి నుంచీ ఏటా తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. టీటీడీలో అన్నదానం ట్రస్టును ఎన్టీఆర్ ప్రారంభించారనీ, ఇప్పటివరకు ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయన్నారు. ఈ పథకంలో ప్రస్తుతం రూ.2,200 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, ప్రతి రోజూ ఎంతోమంది భక్తులు ట్రస్టుకు విరాళాలు ఇవ్వడంతోపాటు మరికొందరు ఒకరోజు అన్నప్రసాద వితరణకు ముందుకు వస్తున్నారని సీఎం తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రక్షాళనతోనే పరిపాలన ప్రారంభించానని, అందులోభాగంగా తొలి పోస్టింగ్ టీటీడీ ఈవోగా శ్యామలరావును ఇచ్చానని గుర్తుచేశారు. రాయలసీమలో పెద్దగా ఆస్పత్రులు లేని విషయం గుర్తించి.. ప్రాణదానం ట్రస్ట్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలుంటే సరిచేస్తామన్నారు.
చీరపై రామాయణ ఘట్టాలు
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో నారా బ్రాహ్మణి కటుక్టున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాల్మీకి రామాయణాన్ని చీరపై ప్రత్యేక డిజైన్‌గా ముద్రించారు. రామాయణ ఘట్టాలతో పాటు వృక్షాలు, శంఖు చక్ర నామాలతో డిజైన్ చేశారు. ఆమె ధరించిన చీరను భక్తులు ఆశ్చర్యంగా చూశారు.
భక్తులకు అల్పాహారం వడ్డించిన దేవాన్ష్
‘దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీగా ఈ ఏడాది కూడా ఒకరోజు అన్నప్రసాదాలకయ్యే ఖర్చు రూ.44 లక్షలు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాం. ఆ తర్వాత అన్నదాన కేంద్రంలో తాత, నాయనమ్మతో కలిసి దేవాన్ష్ భక్తులకు అల్పాహారాన్ని స్వయంగా వడ్డించాడు’ అని నారా బ్రాహ్మణి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి
పొందూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): హిందువుల మనోభావాలను గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని సాధుపరిషత్ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అలిపిరి వద్ద నిర్మిస్తున్న అన్యమతస్థుల హోటల్ నిర్మాణం అనుమతులను రద్దుచేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల రద్దుకోసం స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూసంఘాలు చేపట్టిన పోరాటాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గౌరవించారన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకున్నారన్నారు
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే