Share News

మార్గదర్శుల కోసం.....

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:15 AM

పేదరికమే లేని సమాజ నిర్మాణం కోసం పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీ4) అనే కార్యక్రమానికి తొలి అడుగు పడింది.ఎన్నికల ముందు నుంచి సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చిన పూర్‌ టు రిచ్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మార్గదర్శుల కోసం.....

బంగారు కుటుంబాల ఎదురుచూపులు

పీ4కు 65 వేల కుటుంబాల ఎంపిక

చిత్తూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పేదరికమే లేని సమాజ నిర్మాణం కోసం పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీ4) అనే కార్యక్రమానికి తొలి అడుగు పడింది.ఎన్నికల ముందు నుంచి సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చిన పూర్‌ టు రిచ్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో కలిసి ప్రారంభించారు. సేవా మనస్తత్వం ఉన్న సంపన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.సాయం పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలని, సాయం చేసేవారిని మార్గదర్శులని పిలవనున్నారు.

మన జిల్లాలో 4.86 లక్షల కుటుంబాలుండగా.. పీ4 అమలుకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో 4.78 లక్షల కుటుంబాల్ని సర్వే చేశారు. సచివాలయ ఉద్యోగులు తమ క్లస్టర్‌లోని కుటుంబాలకు సంబంధించిన 27 రకాల ప్రశ్నల్ని అడిగి వారి లాగిన్‌లో నమోదు చేశారు. సర్వేలో 65,219 కుటుంబాలు పీ4 పరిధిలోకి వస్తాయని ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా అధికారులు ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించగా అక్కడ మరోసారి వడపోశాక అత్యంత నిరుపేదలను పీ4 వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. విద్యుత్తు, గ్యాస్‌ సౌకర్యం, సంపాదన వనరులు లేని కుటుంబాలనే దీని పరిధిలోకి తేనున్న క్రమంలో ప్రస్తుతం గుర్తించిన కుటుంబాల్లో 50 శాతానికిపైగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చే సంపన్నులకు ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది.అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఒత్తిడి చేయదు.బంగారు కుటుంబంలో చదువుకునేవారుంటే ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ వంటివి అందించాలి. భవిష్యత్తులో ఆ కుటుంబం మరొకరిపై ఆధారపడకుండా మార్గం చూపించాలి. ఈ కార్యక్రమం అమలు తీరును కలెక్టరు పర్యవేక్షిస్తారు.

జిల్లాలో మొత్తం కుటుంబాలు: 4,86,848

సర్వే చేసినవి: 4,78,229 (98.23ు)

పీ4కు ఎంపిక చేసినవి: 65,219

ఫ అత్యధికంగా.. చిత్తూరు నగరంలోని 5035 కుటుంబాలను పీ4 కార్యక్రమానికి ఎంపిక చేశారు. జీడీనెల్లూరు మండలంలో 2548, పెనుమూరులో 2195, ఎస్‌ఆర్‌పురంలో 2337కుటుంబాలను, కుప్పంలో 2288, రామకుప్పంలో 2358, శాంతిపురంలో 2656, బైరెడ్డిపల్లెలో 2132, వి.కోటలో 2267, బంగారుపాళ్యంలో 2567, ఐరాలలో 2377, తవణంపల్లెలో 2007 కుటుంబాలను ఎంపిక చేశారు.

అత్యల్పంగా.. పాలసముద్రం మండలంలో 573కుటుంబాలను, నగరి అర్బన్‌లో 825, సదుంలో 958, రొంపిచెర్లలో 978 కుటుంబాలను ఎంపిక చేశారు.

Updated Date - Apr 04 , 2025 | 01:15 AM