Police: కొనసాగుతున్న పోలీసు బదిలీలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:22 AM
పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన నేపథ్యంలో జిల్లాలో పోలీసుల బదిలీలు కొనసాగుతున్నాయి.

చిత్తూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన నేపథ్యంలో జిల్లాలో పోలీసుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం 12మంది ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు విడుదల చేశారు. వైసీపీ హయాం నుంచీ పోలీసులు అవే స్థానాల్లో కొనసాగడం వల్లే పుంగనూరు హత్య జరిగిందని, తన నియోజకవర్గంలో అలాంటి పోలీసుల్ని బదిలీ చేయమని చెప్పినా ఎస్పీ పట్టించుకోవడం లేదని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్య 45 మంది పోలీసుల్ని ఓ రోజు, 219 మందిని మరుసటి రోజు బదిలీ చేశారు. వీరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సుమారు 50 మంది ఉండగా, 264మందిని బదిలీ చేయడం అన్యాయమని పోలీసు వర్గాల్లో చర్చ కూడా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా శనివారం 12 మంది ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పించడంతో బదిలీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. 12మందిలో ముగ్గుర్ని స్టేషన్ల నుంచి బదిలీ చేయగా, వీఆర్‌లో వున్న 9మందికి స్టేషన్లు కేటాయించారు. 12 మందిలో సహదేవి మినహా 11 మందీ ప్రమోటీ ఎస్‌ఐలే కావడం విశేషం.
పెద్దపంజాణి ఎస్‌ఐగా పనిచేస్తున్న సహదేవి వైసీపీ హయాం నుంచీ అక్కడే పనిచేస్తున్నారని, ఆమె భర్త వైసీపీ నేత అని, ఎంపీ మిథున్‌రెడ్డికి ముఖ్య అనుచరుడని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తాజా బదిలీల్లో ఆమెకు చిత్తూరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
ఎన్నికలకు ముందు నుంచీ విజయపురంలో పనిచేస్తున్న బలరామయ్యను చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు మార్చారు. ఈయన వైసీపీ వారితో అనుకూలంగా ఉంటున్నారని, అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకే డీటీసీకి మార్చారని చెబుతున్నారు.
చిత్తూరు టూ టౌన్ ఎస్‌ఐ ప్రసాద్ కూడా వైసీపీ హయాంలో చిత్తూరు వన్ టౌన్‌లో పనిచేశారు. ఈయన మీద కూడా అవినీతి ఆరోపణలు ఉండడంతో బంగారుపాళ్యం యూపీ స్టేషన్‌కు మార్చినట్లు తెలుస్తోంది.
ఇక మిగిలిన 9 మంది ఎస్‌ఐలు ఇటీవల సత్యసాయి జిల్లా నుంచి చిత్తూరుకు వచ్చారు. వీరంతా ప్రమోటీలే. ఎర్రిస్వామికి చిత్తూరు వన్ టౌన్, వెంకటరమణకు టూటౌన్, తులసన్నకు సీసీఎస్, రామచంద్రయ్యకు పెనుమూరు, విజయ్ నాయక్‌కు నగరి యూపీఎస్, వెంకటనారాయణకు ఎన్‌ఆర్‌పేట, కె.రంగాకు విజయపురం, వెంకటరమణకు పుంగనూరు యూపీఎస్, ధనంజయరెడ్డికి పెద్దపంజాణి స్టేషన్లను కేటాయించారు.