Share News

Andhra Jyothi: అపూర్వ స్పందన

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:32 AM

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో మొదలైన వైద్యజ్యోతి శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.

Andhra Jyothi: అపూర్వ స్పందన
శిబిరాన్ని ప్రారంభించాక వైద్య పరీక్షలు చేయించుకున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

నేటితో ముగియనున్న వైద్య శిబిరాలు

తిరుపతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో మొదలైన వైద్యజ్యోతి శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు శిబిరానికి హాజరై ఉచితంగా వైద్య సలహాలు తీసుకున్నారు. శనివారం ఉదయం తుడా సర్కిల్లోని ఇందిరామైదానంలో ఏర్పాటుచేసిన ఆంధ్రజ్యోతి- వైద్యజ్యోతి కార్యక్రమాన్ని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రారంభించారు. వివిధ ఆస్పత్రులు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా ఆస్పత్రులు అందించే వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వైద్యజ్యోతి శిబిరంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది రాత్రి 8 గంటల వరకు సేవలందించారు. ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా రోగులకు అవసరమైన చికిత్స కోసం సంబంధిత ఆస్పత్రులకు వెళ్లేవారికి ప్రత్యేక రాయితీలను అందించారు.

ప్రసిద్ధ ఆస్పత్రుల వైద్య సేవలు

ఆంధ్రజ్యోతి- వైద్య జ్యోతిలో వెంకటరమణ గుండె, మెటర్నిటీ హాస్పిటల్‌ స్టాల్‌లో ఈసీజీతో పాటు గుండెసంబంధిత వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. మనోహరి రామచంద్ర హాస్పిటల్‌, అంకుర హాస్పిటల్స్‌ వారు తమ స్టాళ్లలో గర్భిణులు, తల్లి కావాలనుకునే మహిళలకు ఆరోగ్య సలహాలు ఇచ్చారు. గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భస్థ శిశువుల ఆరోగ్య మెలకువలను వివరించారు. ఆస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌ వారు ప్రధానంగా ఆర్థోపెడిక్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. డీఎన్‌ఆర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, యష్‌ హాస్పిటల్స్‌, శ్రీసాయి సుధా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌, డీబీఆర్‌ అండ్‌ ఎస్కే క్యాన్సర్‌ సెంటర్‌, మెడిగో హాస్పిటల్స్‌, సన్‌ప్రైమ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ స్టాళ్లలో వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.కాకర్ల డెంటల్‌ హాస్పిటల్‌, కృష్ణతేజ డెంటల్‌ హాస్పిటల్స్‌ వారు దంత సంబంఽధ పరీక్షలు నిర్వహించి, అధునాతన దంత వైద్యంపై అవగాహన కల్పించారు.

ఉచితంగా మందులు

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు పి.మనోహర్‌ రెడ్డి, కేపీ చౌదరి ప్రధాన స్పాన్సర్‌గా, సీపీఆర్‌ కనస్ట్రక్షన్స్‌ వారు కో స్పాన్సర్‌గా వ్యవహరించి రోగులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు, ఆంధ్రజ్యోతి తిరుపతి బ్రాంచ్‌ మేనేజర్‌ వి.సురే్‌షరెడ్డి, ఎడిషన్‌ ఇంఛార్జి వి.సుధాకరబాబు, ఏడీవీటీ ఇంచార్జి ఈశ్వరనాయుడు, ప్రొడక్షన్‌ ఇంచార్జి మోహన్‌ రావు, సర్క్యులేషన్‌ ఇంచార్జి ఉమాపతి, బ్యూరో ఇన్‌ఛార్జి శివప్రసాద్‌, స్టాఫ్‌ రిపోర్టర్‌ పి.నరేంద్ర, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ శంకర్‌ రెడ్డి , ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.

నేడు కూడా హెల్త్‌ క్యాంప్‌

ఆదివారం కూడా మెగా హెల్త్‌ క్యాంప్‌ ఇందిరా మైదానంలో కొనసాగనుంది. తిరుపతిలోని ప్రసిద్ధ ఆస్పత్రుల స్టాళ్లలో ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రముఖ డాక్టర్లు పాల్గొంటారు. తిరుపతి నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.


ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

ఆరోగ్య సమస్యలతో సతమతం అయ్యే చాలామంది ఏ ఆస్పత్రికి వెళ్లాలో, ఏ డాక్టర్‌ను కలవాలో తెలియక ఇబ్బందిపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఒక్క చోటే ఇంత పెద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. తిరుపతిలోని ప్రసిద్ధ ఆస్పత్రులన్నీ ఇక్కడ కన్పిస్తున్నాయి. ప్రముఖ డాక్టర్లంతా వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు ఇవ్వడం గొప్ప విషయం. ఇక్కడ పరీక్షలు చేయించుకున్నవారికి తమ ఆస్పత్రుల్లో ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తామంటున్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలోకి రాని కొన్ని వ్యాధులకు ఇక్కడ ఉచితంగా చికిత్స దొరుకుతోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెగా హెల్త్‌మీట్‌ నిర్వహించిన ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌కి ప్రత్యేక అభినందనలు.

Updated Date - Mar 23 , 2025 | 01:32 AM