Share News

కార్యకర్తల కోసం ఎంతదూరమైనా వెళతాం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:48 AM

టీడీపీకి పునాదులైన కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతదూరమైనా వెళతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.

కార్యకర్తల కోసం ఎంతదూరమైనా వెళతాం
రామకృష్ణ కుమారుడు శివతో మాట్లాడుతున్న రాంప్రసాద్‌ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఎమ్మెల్యేలతో కలసి రామకృష్ణ కుటుంబానికి పరామర్శ

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ

పుంగనూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి):టీడీపీకి పునాదులైన కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతదూరమైనా వెళతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురంలో ఇటీవల వైసీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన టీడీపీ కార్యకర్త కె.రామకృష్ణ కర్మక్రియల్లో మంత్రి పాల్గొన్నారు.ఎమ్మెల్యేలు ఎన్‌.అమరనాథరెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, గురజాల జగన్మోహన్‌, కె.మురళీమోహన్‌, ఎస్‌.షాజహాన్‌బాషా, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు చల్లా రామచంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి,తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్‌రాజు, సీఆర్‌.రాజన్‌ తదితరులతో కలసి రామకృష్ణ ఇంటివద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించారు.ఆయన భార్య ఉమాదేవి, కుమారులు శివ, సురేశ్‌ కుమార్‌లతో మాట్లాడి వారి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి, ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి టీడీపీకి రామకృష్ణ సేవలను గుర్తుచేశారు.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ మీకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాలని ఆదేశించడంతో తాము ఇంతమంది మీ ఇంటికి వచ్చామని, దీన్ని మీరు అర్థం చేసుకోవాలన్నారు.10 రోజుల్లో రామకృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు, లోకేశ్‌ వద్దకు తీసుకెళతామన్నారు. మూడు రోజుల్లో కొంత ఆర్ధికసహాయం అందిస్తామని వివరించారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫోన్‌ చేయండని భరోసా ఇచ్చారు. రామకృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యేలు, రాజన్‌ కొంత నగదు సహాయం చేశారు.అయితే తమకు న్యాయం కావాలని, రామకృష్ణ హంతకులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.అనంతరం మీడియా సమావేశంలో రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని, అర్హతను బట్టి ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో బాటు ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అనంతరం కృష్ణాపురం వచ్చిన మదనపల్లె ఎమ్మెల్యే ఎస్‌.షాజహాన్‌బాషా మాట్లాడుతూ రామకృష్ణ కుటుంబానికి మూడు రోజుల్లో మదనపల్లె సమీపంలోని నవోదయ విద్యాలయం వద్ద ఒక కుంట నివాస స్థలాన్ని పట్టా ఇప్పిస్తానని తెలిపారు. చౌడేపల్లె, పుంగనూరు మండలాల టీడీపీ అధ్యక్షులు గువ్వల రమేశ్‌రెడ్డి, మాధవరెడ్డి, టీడీపీ నాయకులు సీడ్‌ మల్లిఖార్జున నాయుడు, సీవీరెడ్డి, పోలీ్‌సగిరి, రవి, రాజశేఖర్‌, రాఘవ, అమరనాథ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:48 AM